మళ్లీ జలదిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం
వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. దేశంలోనే రెండో వన దుర్గ మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.
దిశ, పాపన్నపేట: వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. దేశంలోనే రెండో వన దుర్గ మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్పగూరి జలకల సంతరించుకోవడంతో దిగువకు నీటిని వదిలారు. దీంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి.
దీంతో సోమవారం వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా పున: ప్రారంభిస్తామని ఆలయ పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో సారా శ్రీనివాస్ పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు భక్తులు ఎవరు వెళ్లకుండా స్థానిక ఎస్సై మహిపాల్ రెడ్డి భారీకేడ్లు ఏర్పాటు చేశారు.