ఇంటింటి సర్వే మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం : ఉపముఖ్యమంత్రి
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శనివారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియ పై తన క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక శాఖ చీఫ్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
భవిష్యత్తులో యావత్తు దేశానికి స్ఫూర్తిగా నిలిచే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని జిల్లా కలెక్టర్లను, ఎన్యూమరేటర్లకు అభినందించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని శనివారం నుంచి ఇంటింటి సమగ్ర సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేలా వారిని ఆహ్వానించాలని తెలిపారు. యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తున్నదని, నిబద్ధతతో సర్వేపూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
అనంతరం వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సర్వేకోసం జారీ చేసిన బుక్ లెట్ లోని అంశాల పై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను సూపర్వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీపీఓ సాయిబాబా, డీఆర్ డీఓ జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీష్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.