ఫార్మాసిటీ మాకొద్దు

ఫార్మాసిటీ మాకొద్దుంటూ న్యాల్కల్ మండల రైతులు గర్జించారు.

Update: 2024-09-02 14:23 GMT

దిశ, జహీరాబాద్ : ఫార్మాసిటీ మాకొద్దుంటూ న్యాల్కల్ మండల రైతులు గర్జించారు. సమాచారం లేకుండా స్థల పరిశీలన చేస్తున్న అధికారులను రైతులు కూడా అనుకోకుండా చుట్టుముట్టి పెద్ద షాకిచ్చారు. అకస్మాత్తుగా వేల సంఖ్యలో అక్కడికి చేరుకొని వారిని అడ్డుకొని ఘెరావ్ చేశారు. డప్పూర్- బీదర్ రోడ్డుపై బైఠాటాయించి సుమారు 4 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. "సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, వద్దురా వద్దు ఫార్మసిటీ వద్దు " అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు.

     మండల పరిధిలోని డప్పూర్ మల్కి వడ్డీ గ్రామాల రైతులందరూ ఆందోళన బాటపట్టారు. భూములు తీసుకోమని రాసివ్వాలని ఆర్డీఓ రాజును రైతులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో పనికిరాని భూమి ఉందని ఎట్లా నివేదిక ఇస్తారంటూ రైతులు ఆయనను నిలదీశారు. గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని అక్కడ మీ అభిప్రాయాలు చెప్పొచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం అడిగిన నివేదికలే పంపించామని, తన వ్యక్తిగత అభిప్రాయాలు కాదంటూ వెళ్లిపోయారు. గ్రామసభ వద్దంటూ మూకుమ్మడిగా రైతులు వ్యతిరేకించారు.

4 గంటలపాటు ఘెరావ్...కారులోనే అధికారులు

ఫార్మాసిటీ భూములను పరిశీలించేందుకు వచ్చిన జేసీ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రాజు ఇతర అధికారులను ఫార్మాసిటీ పరిధిలోని మూడు గ్రామాల రైతులు సుమారు నాలుగు గంటల పాటు ఘెరావ్ చేశారు. పరిశీలనకు వచ్చిన అధికారులు ఒక్కరు కూడా కారులో నుంచి దిగలేదు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి రైతులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అయినప్పటికీ కలెక్టర్ రావాల్సిందేనంటూ భీష్మించారు.

    ఎట్టకేలకు కలెక్టర్ తో చర్చలు జరిపేందుకు తాను అవకాశం కల్పిస్తానని డీఎస్పీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సంఘటన స్థలానికి జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు సీఐ శివలింగం, హనుమంతు, ఎస్ఐలు, సిబ్బంది చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకున్నారు. 

Tags:    

Similar News