పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దు..
జీహెచ్ఎంసీ పరిధిలోని భారతి నగర్, రామచంద్రాపురం పటాన్ చెరు డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రతి కాలనీలో నిరంతరం చెత్త సేకరణ చేయాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
దిశ, పటాన్ చెరు : జీహెచ్ఎంసీ పరిధిలోని భారతి నగర్, రామచంద్రాపురం పటాన్ చెరు డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రతి కాలనీలో నిరంతరం చెత్త సేకరణ చేయాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ల పరిధిలో చెత్త సేకరణకు వినియోగిస్తున్న వాహనాలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు.
కాలనీలో, రహదారులలో సేకరించిన చెత్తను తక్షణమే సంబంధిత వాహనాలలో తరలించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి పారిశుధ్య కార్మికుల విధులు ప్రారంభం కావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో సైతం చెత్త సేకరణ చేపట్టాలని ఆదేశించారు. జిహెచ్ఎంసీ ఉన్నత అధికారులతో పాటు పారిశుద్ధ్య విభాగం అధికారులు ప్రతి రోజు ఉదయం కాలనీలలో విధిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బల్దియ డిప్యూటీ కమిషనర్ సురేష్, ఏ ఎమ్ హెచ్ విజయ్ కుమార్, రాంకీ సంస్థ జోనల్ ఇంచార్జ్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.