పల్లెల్లో కార్పొరేట్ విద్యాసంస్థల ఏజెంట్లు ?
పల్లెల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు తిష్ట వేస్తున్నాయి.
దిశ, చేర్యాల : పల్లెల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు తిష్ట వేస్తున్నాయి. రాష్ట్రంలో పేరున్న కొన్ని విద్యా సంస్థలు చేర్యాల ప్రాంతంలో ఏజెంట్లను నియమించుకుని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన విద్యార్థులను పదో తరగతి తర్వాత ఇంటర్ మీడియట్ లో తమ కార్పొరేట్ కాలేజీ సంస్థల్లో చదివే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రుల పైన మానసికంగా ఒత్తిడిని తెస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అత్యవసర సమయాల్లో కూడా పిల్లతో కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులకు మాత్రం గంటల తరబడి సమయం ఇవ్వడంతో పాఠాలను పక్కన బెట్టి, తమ ఉపన్యాసాలతో విద్యార్థుల దృష్టి మరల్చే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు.
తల్లితండ్రుల పైన నిత్యం ఒత్తిడి..
పాఠశాలల్లో విద్యార్థుల దృష్టి మరలిస్తూనే ఇటు తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నుండి వారి పూర్తి సమాచారం సేకరించి ఇంటర్ లో తమ కాలేజీల్లో చేర్పించాలని నిత్యం ఫోన్ చేస్తూ, లేదంటే స్వయంగా ఇంటికి వచ్చి పిల్లలను తమ కార్పొరేట్ సంస్థల్లో చేర్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా వారి మాటలకు ఆకర్షితులై స్థాయికి మించి ఆర్థిక భారం పడటంతో చేసేది ఏమి లేక ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు.
స్వలాభం కోసం సహకరిస్తున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ?
విద్యార్థుల పూర్తి వివరాలు గోప్యంగా ఉంచవలసిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ స్వలాభం కోసం పిల్లల పూర్తి వివరాలు, తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లు ఇవ్వడంతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే వారిని నిత్యం ఫోన్ లు చేసి విసిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.