రోడ్డుకి ఇరువైపులా కోవాలెంట్ పరిశ్రమ భారీ మెషినరీ..

హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచునూర్ శివారులో గల కోవాలెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సాపూర్ సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Update: 2024-09-18 14:38 GMT

దిశ, హత్నూర : హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచునూర్ శివారులో గల కోవాలెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సాపూర్ సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకుండానే పరిశ్రమకు భారీ మెషినరీ తరలించే సమయంలో ప్రధాన రహదారికి అడ్డంగా భారీ వాహనాన్ని నిలిపివేయడంతో రెండు కిలోమీటర్ల మేరకు రెండు గంటల పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆసుపత్రులకి వెళ్లేవారు విద్యార్థులు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల పైనే ఎర్రటి ఎండలో వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అనేక అవస్థలకు గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం సైతం నిబంధనలు పాటించకుండానే తమపని తాము చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. ఇలాంటి అతి భారీ మెషినరీని తరలించే సమయంలో ఉన్నతాధికారులు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే ప్రయాణికులకు అంతరాయం కలగకుండా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం పై ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News