Harish Rao : కాంగ్రెస్ పార్టీ నాయకులవి డైవర్షన్ పాలిటిక్స్

కాంగ్రెస్ పార్టీ నాయకులవి డైవర్షన్ పాలిటిక్స్ అయితే బీఆర్ఎస్ వి వాటర్ డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ నాయకుల తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు

Update: 2024-09-20 13:44 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులవి డైవర్షన్ పాలిటిక్స్ అయితే బీఆర్ఎస్ వి వాటర్ డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ నాయకుల తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ లోకి మొట్ట మొదటి సారిగా 20 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోయడాన్ని పురస్కరించుకొని శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పసుపు కుంకుమ వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...కేసీఆర్ కల ఫలించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతి గింజ మీద కేసీఆర్ పేరు ఉంటుందని, ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ పేరు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్ కు తాగునీరు.. మూసీ నదికి నీళ్లు తీసుకుని పోతా అంటుండు.. దానికి కూడా మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగరే దిక్కు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని,ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, అబద్దాలు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు 21 టీఎంసీల గోదావరి జలాలతో సముద్రాన్ని తలపిస్తున్న మల్లన్న సాగరే సజీవ సాక్ష్యం అన్నారు. కాంగ్రెస్ అబద్దాలకు గల గల పారుతున్న గోదావరి జలాలే సమాధానం చెబుతాయన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ నాయకులు మూర్ఖపు మాటలు మానుకొని మల్లన్న సాగర్ లో పసుపు కుంకుమ వేసి కొబ్బరి కాయ కొడితే పాపాలు తొలిగిపోతాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుక పోతే అన్నపూర్ణలో కి 3 టీఎంసీలు, రంగనాయక సాగర్ లోకి 3 టీఎంసీలు, మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ లో 10 టీఎంసీల జలాలు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. మల్లన్న సాగర్ గోదావరి జలాలతో నింపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోవడానికి వస్తే అడ్డుకోవాలని ప్రయత్నించడం బాధాకరం అన్నారు. గోదావరి జలాలతో మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు అన్నారు. మల్లన్న సాగర్ పూర్తయిందని, కాలువల పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం కాలువలు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లలను వెంటనే వదలాలని ప్రభుత్వాన్ని కోరారు.


Similar News