మీకు దమ్ముంటే ఘణపురం ఆనకట్టకు రండి : Mynampally Rohith

మీకు దమ్ముంటే 48 గంటల్లోపు ఘణపురం ఆనకట్టకు రండి..

Update: 2023-10-26 13:06 GMT

దిశ, పాపన్నపేట: మీకు దమ్ముంటే 48 గంటల్లోపు ఘణపురం ఆనకట్టకు రండి.. ఎత్తు పెంచామని చెప్పుకుంటున్న మీ కల్లబొల్లి మాటలను అక్కడ తేల్చుకుందామని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు మెదక్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సవాల్ విసిరారు. గురువారం పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్ లో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ..ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచింది లేదు.. నీరు పుష్కలంగా అందించింది లేదన్నారు. ఎత్తు పెంచితే 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇప్పుడున్న ఘణపురం ఆనకట్టతో 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. ఎత్తు పెంచామని అబద్ధపు మాటలు చెబుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మంభోజిపల్లిలోని ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చి.. 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దాని ఊసే లేదన్నారు. కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరికి బీసీ బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి మిగతా వారికి ఆశ చూపుతున్నారన్నారు. కేసీఆర్ మాయమాటలను ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరని, గత పదేళ్లలో వారి మాటలను నమ్మి మోసపోయారని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. మెదక్ నుంచి కార్యాలయాలు, కాలేజీలు, జింకలను సైతం సిద్దిపేటకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిలా ముందు ఉంటానని పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ఓ పేరున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీ కాంతప్ప, పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, మౌనిక, నాగమణి, నాయకులు వరుణ్ రెడ్డి, జీవన్ రావు తదితరులతో పాటు యువకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News