Ramappa : ప్రపంచ వారసత్వ సంపదకు బొగ్గు గనులతో ముప్పు?
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం ప్రమాదపుటంచులో ఉన్నట్టు జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
దిశ, ములుగు ప్రతినిధి : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం ప్రమాదపుటంచులో ఉన్నట్టు జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరగడమే కారణమని తెలుస్తోంది. కాకతీయుల అద్భుత కట్టడంగా ప్రశంసలు పొందుతూ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచ ప్రసిద్ధి పొంది, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప పరిసర ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండడంతో రామప్ప ఆలయానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని జిల్లా ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.
సర్వేల రిపోర్టుతో మొదలైన ఆందోళన..
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో కాకతీయులు నిర్మించిన రామప్ప రామలింగేశ్వర ఆలయం ఒక అద్భుత కట్టడంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది యునెస్కో గుర్తింపు కూడా తెచ్చుకుంది. ప్రపంచంలోనే గొప్ప కట్టడాల్లో ఒకటిగా పేరొందిన రామప్ప దేవాలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే బొగ్గు వెలికి తీసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్ కాస్టు మైనింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ ఉనికి పై అనేక సందేహాలు నెలకొన్నాయి. 2012లో వెంకటాపూర్ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి వెంకటాపూర్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవి పేట, అడవి రంగాపురం, జవహర్ నగర్ చుట్టూ ఉన్న గ్రామాలతో కలిపి 1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలు జరిపేలా ప్రతిపాదన చేయగా దీనిపై ప్రజల, మేధావుల నుండి నిరసనలు ఎదురుకావడంతో వెనక్కి తగ్గింది. మళ్లీ గతకొద్దికాలంగా సింగరేణి ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలో బొగ్గు శాంపిల్స్ సేకరిస్తూ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్‌ఐ), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో బొగ్గును వెలికి తీయడంతో రామప్ప ఆలయానికి ఎలాంటి హాని ఉండదని ధ్రువీకరించినట్టు, దీనిని ఆసరాగా తీసుకొని సింగరేణి బొగ్గు వెలికితీతకు సన్నాహాలు చేస్తున్నట్టు ఊహగానాలు వినిపించడంతో మళ్లీ రామప్ప భద్రతపై జిల్లా ప్రజలు, మేధావులలో ఆందోళన చెందడమే కాకుండా సర్వే రిపోర్ట్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లెక్క తప్పితే రామప్పకు తీవ్ర నష్టం...
కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప ఆలయం 800 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదలు, భూకంపాలను తట్టుకొని చెక్కుచెదరకుండా నిలబడింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాన్ని సింగరేణి తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు మైనింగ్ రూపంలో ఆపద తలపెట్టేందుకు చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ అనుమతులు పొందిన తర్వాత పేలుడు పదార్థాలు ఉపయోగించడంలో ఏమాత్రం లెక్క తప్పినా పెద్ద ఎత్తున రామప్ప ఆలయానికి ముప్పు జరుగుతుందని, భౌగోళికంగా రామప్ప చెరువు, రామప్ప దేవాలయం కింది భాగంలో మైనింగ్ జరిగే ప్రదేశం ఉండడంతో పేలుళ్ల దాటికి భూమి పొరల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే రామప్ప చెరువు, ఆలయానికి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రామప్ప చుట్టుపక్కల పర్యావరణంపై దీని ప్రభావం ఉంటుందని మేధావులు మైనింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చరిత్ర కంటే బొగ్గు విలువైనది కాదు.. వెంకట రామ్మోహన్ రావు, రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్, మాజీ సర్పంచ్ పాలంపేట.
వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయానికి దగ్గరలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్న తీరును రామప్ప పరిరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 18 ఏళ్లు మాత్రమే బొగ్గు నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ చేయడంతో ప్రభుత్వానికి పెద్ద ఉపయోగం లేదు. చరిత్రకు జరిగే నష్టంతో పోలిస్తే వెలికి తీసే బొగ్గు అత్యంత విలువైనది కాదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కంటే రామప్ప గుడితో ప్రపంచ పర్యాటక రంగాన్ని విశేషంగా ఆకర్షించవచ్చు. గత నాలుగు సంవత్సరాల్లో రామప్ప ఆలయానికి విచ్చేసే పర్యాటకుల తాకిడి 300 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని నెలకొల్పే ప్రయత్నాలు మానుకోవాలి.
రామప్పకు ముప్పు కలగవచ్చు.. కాకతీయ హెరిటేజ్ సభ్యుడు, ప్రొఫెసర్ పాండురంగారావు
అద్భుత కళాఖండంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సింగరేణి బొగ్గు గనితో ముప్పు కలిగే అవకాశం ఉంది. రామప్ప గుడి, రామప్ప చెరువు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం నాటి భూ అమరికలో పగుళ్లను గుర్తించాము. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రారంభమైతే 300 మీటర్ల లోతు హై హైడ్రాలిక్ గ్రేడియంట్ ఏర్పడి భూ అమరికలో ఉన్న పగుళ్లు పెద్దవై పై భాగంలో ఉన్న రామప్ప చెరువుకు లీకేజ్ ఏర్పడి నీరు పగుళ్లలోకి వెళ్లి, సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడి కింది భాగంలోని ఇసుక తన స్థితిని కోల్పోయి బలహీనపడి గుడి పడిపోయే అవకాశం ఉన్నట్టు మా అధ్యయనంలో తెలుస్తోంది. సింగరేణి యాజమాన్యం రామప్ప ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలికి తీసే ప్రతిపాదన విరమించుకోవాలి.