వన దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న పవిత్ర ప్రదేశం..

Update: 2024-12-25 09:15 GMT

దిశ, పాపన్నపేట : మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న పవిత్ర ప్రదేశం.. జనమేజయుడు సర్పయాగం స్థలిగా వినుతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12:40కి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రత్యేక చాపర్ ద్వారా ఏడుపాయలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి రేవంత్ రెడ్డి పేరిట ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

తదుపరి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, మదన్ రెడ్డి తదితరులతో కలిసి ఏడుపాయల ఆలయ అభివృద్ధికి రూ.35 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసి, స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల చెక్కును అందించారు. అనంతరం రోడ్డు మార్గంలో మెదక్ చర్చికి చేరుకున్నారు. సీఎం రాకతో ఏడుపాయలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసింది. సీఎం రేవంత్ రెడ్డి ని చూసేందుకు, కలిసేందుకు నాయకులు, ప్రజలు ఉత్సాహం చూపారు.

సీఎంకు కొన్ని ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే రోహిత్ రావు..

స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఏడుపాయల మరింత అభివృద్ధికి, మండల కేంద్రం పాపన్నపేటతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న మేజర్ సమస్యలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు అందించారు.


Similar News