సీఎం కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం : స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
సీఎం కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
దిశ, రాయపోల్: సీఎం కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సాగునీరందించే మల్లన్న సాగర్ రిజర్వాయర్, టన్నెల్ నిర్మాణాలను శనివారం బాన్సువాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. గజ్వేల్ మండలం కేసారం, గిరిపల్లి, రాయపోల్ మండలం వీరానగర్ వద్ద టన్నెల్, కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశం, సమాజం బాగుపడాలన్నా ముందుగా నీరే ప్రధానమని అన్నారు. త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తే అభివృద్ధి అదంటత అదే జరుగుతుందన్నారు. అంత గొప్ప ఆలోచన చేసిన మొదటి వ్యక్తి భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ అయితే, ఆ అలాంటి ఆలోచన చేసిన వ్యక్తి సీఎం కేసీఆరేనని అన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ నీళ్లు ఇచ్చింది లేదన్నారు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేసిన వ్యక్తి సీఎం కేసీఆరేనని అన్నారు. సీఎం సూచనతోనే నేడు మల్లన్న సాగర్ ను పరిశీలించేందుకు వచ్చామన్నారు.
తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలను, నాయకులను చూశాను..కానీ.. పట్టుదలతో ప్రజల సమస్యలను తీర్చిన ఏకైక నాయకుడు కేసీఆరేనని అన్నారు. గోదావరి నదిలో ఏటా 1,600 టీఎంసీల నీరు వృథాగా పోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా అనంత సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు మళ్లిస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.75 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. వాగులు, చెరువులు, ఎత్తిపోతల కింద మరికొంత సాగవుతోందన్నారు. 13 జిల్లాలు 31 నియోజకవర్గాలలోని 50 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో జుక్కల్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, చిలుముల మదన్ రెడ్డి, అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సాగునీటి శాఖ ఈ.ఎన్.సీ మురళీదర్, సీఈ అజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.