చేర్యాల కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధి పై క్లారిటేది..?
చేర్యాల కుడి చెరువు పరిధి పై అధికారుల్లో స్పష్టమైన అవగాహన
దిశ, చేర్యాల: చేర్యాల కుడి చెరువు పరిధి పై అధికారుల్లో స్పష్టమైన అవగాహన లేకపోవడంతో హద్దులు నిర్ణయించే విషయంలో పలుమార్లు మార్పులు జరగడంతో బడా బాబులకు ఎఫ్టీఎల్ పరిధి భూమిని ఆక్రమించడం సులువుగా మారింది. వివరాల్లోకి వెళితే చేర్యాల కుడి చెరువు విస్తీర్ణం 202 సర్వే నెంబర్ పరిధిలో 60 ఎకరాల 21 గుంటలు గా ఉండగా చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధి అంటే (చెరువు ముందు స్థలం) 203 సర్వే నెంబరు పరిధిలో 19 ఎకరాల 23 గుంటలు ఉన్నది.ఐతే చెరువు ముందు ఉన్న ఎఫ్ టి ఎల్ పరిధి భూమి పట్టా అయినప్పటికీ రైతులు పంటలు పండించి లబ్ధి పొందాలి.
అయితే రైతులకు డబ్బు ఆశ చూపి కొంతమంది బడా బాబులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిని ఆక్రమించుకొని పలు భవనాలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు,కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఉపేక్షించేది లేదని,హైడ్రా తరహాలో జిల్లాల్లో కూడా అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా ప్రకటించడంతో అక్రమార్కులు గుండెల్లో గుబులు మొదలైంది.
హద్దులు విషయంలో అధికారుల పై అనుమానాలు..?
అయితే చెరువు విస్తీర్ణం పరిధి నిర్ణయించే విషయంలో అధికారులు కొలతలు చేపట్టిన ప్రతిసారి హద్దులు మారడంతో పాటు వారు నిర్ణయించిన హద్దు పరిధి దాటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కనుమరుగైన నాళాలు..
వర్షం కురిసినప్పుడు చెరువులోకి నీరు వచ్చే నాళాలు గాంధీ సెంటర్, యూనియన్ బ్యాంకు దగ్గర, కొత్త బస్టాండ్ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు ఉండగా వాటిని సైతం, ఆక్రమించుకొని వాటిని పూడ్చి వాటిపైన నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు చెరువులోకి వెళ్ళే మార్గం లేక పలు కాలనీలు నీట మునుగుతున్నాయి.
ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం : నర్సింహులు, ఏఈఈ ఇరిగేషన్ శాఖ
చెరువు విస్తీర్ణం పరిధిలో గాని, ఎఫ్ టి ఎల్ పరిధి దాటి గాని ఎవరైనా నిర్మాణాలు చేపట్టిన, నాళాలు అక్రమించినట్లు మా దృష్టికి తీసుకువస్తే వాటిని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
పూర్తి స్థాయి సర్వే చేపట్టాలి : అవుశర్ల వెంకటేష్ , కుడి చెరువు పరిరక్షణ సమితి కార్యదర్శి
చెరువు విస్తీర్ణం పైన పూర్తి స్థాయి సర్వే చేపట్టాలి.చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపిన చట్టపరమైన చర్యలు తీసుకొని, కట్టడాలను తొలగించాలి. లేదంటే కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాము.