నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టాలి : వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుల ప్రయోజనాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2023-05-16 12:12 GMT

దిశ, సంగారెడ్డి : రైతుల ప్రయోజనాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉన్నతాధికారులతో కలిసి వానా కాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాలతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారుదేనని అన్నారు. పదే పదే నకిలీ విత్తనాల దందాను నిర్వహించే వారిని గుర్తిస్తూ, అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ ను ప్రయోగించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు నష్ట పోకూడదని అన్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులను చైతన్య పరచాలని అన్నారు. తనిఖీల సమయంలో టెస్ట్ కిట్లను తీసుకెళ్లాలని, రైతులకు ఆయా విత్తనాలు, వారి భూములు ఏ విధమైన పంటకు అనువుగా ఉన్నాయో పరిశీలించాన్నారు. అనంతరం వారికి వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు చేయాలన్నారు. జిల్లాలో ఆకస్మిక తనీఖీల సమయంలో గడువు తేదీ ముగిసిన విత్తనాలు అమ్మడం, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపట్టడం, నకిలీ విత్తనాలు ఉండటం వంటి అంశాల పట్ల నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి ఎస్పీ రమణ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, ఉద్యాన శాఖ డీడీ వెంకటేశ్వర్లు, ఏడీఏలు, ఏవోలు, ఉద్యాన శాఖ అధికారులు, డీఎస్పీ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News