రెచ్చిపోతున్న చైన్ స్నాచర్‌లు.. మొరాయిస్తున్న సీసీ కెమెరాలు
వరుస దొంగతనాలతో చైన్ స్నాచర్ల రెచ్చి పోతుండటంతో ప్రజలు

దిశ,తూప్రాన్ : వరుస దొంగతనాలతో చైన్ స్నాచర్ల రెచ్చి పోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మండలాల్లో నెల రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు జరగడం తో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. బైక్ పై వస్తున్న దొంగలు వంటరీ మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు కూడా మండల వ్యాప్తంగా ఎక్కడ పని చేయకపోవడంతో దొంగలు పట్టుకోవడం పోలీసులకు కూడా ఒక సవాల్ గా మారింది.
నెల వ్యవధిలో మూడు సంఘటనలు...
ఉమ్మడి తూప్రాన్ మనోహరాబాద్ మండల వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 23 తారీకు నాడు మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన కలకల్ లో ఆదివారం సంత జరుగుతుండగా పండ్లు అమ్ముకునే మహిళ దగ్గరికి బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చి మెడలో చైన్ లాగే ప్రయత్నం చేయగా ఆమె అరవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. మార్చి 9 వ తారీఖు నాడు అదే గ్రామంలో అంగన్వాడీ 2 సెంటర్ నుంచి మూడేళ్ల పాపని గుర్తు తెలియని దుండగులు చాక్లెట్ ఇప్పిస్తామని ఎత్తుకెల్లగా అప్రమత్తమైన టీచర్ అరవడంతో గ్రామస్తులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు... నేడు గురువారం నాడు ఉదయం 7 గంటల సమయంలో తూప్రాన్ పట్టణంలో ఎల్లమ్మ వీధిలో ముగ్గు వేస్తున్న వృద్ధురాలి మెడలోంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆరు తులాల బంగారు గొలుసు అపహరణకు పాల్పడ్డారు. లాగిన చైన్ రాకపోవడంతో ఆమెను కింద తోసేసి నోరు మూసి గొలుసు లాక్కుని వెళ్తుండగా ఆమె అరవడంతో బైక్ అక్కడే వదిలేసి పారిపోయారు.
మండల వ్యాప్తంగా మొరాయిస్తున్న సీసీ కెమెరాలు...
ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన విషయం తెలిసింది కాగా మూడునాళ్ల ముచ్చటగానే వాటి పనితీరు ఉంది. ఏర్పాటుచేసిన కొన్ని రోజులకే సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి దీంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పోలీసులకి పెద్ద సవాల్ గా మారింది. జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పై కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో యాక్సిడెంట్ అయిన దృశ్యాలు చేదించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది.
ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలి...
వరుస దొంగతనాలు కిడ్నాప్ లు జరుగుతున్న విషయంపై పోలీసులు గ్రామంలో ప్రముఖులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం పై అవగాహన కల్పించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఒంటరిగా ఉండవద్దని అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానం వస్తే వెంటనే పోలీసులకు 100 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.