నిరుద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర బీఆర్ఎస్‌దే : Damodar Raja Narasimha
తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని మా పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడియాసలు చేసిందని దామోదర్ రాజనర్సింహ అన్నారు.
దిశ, అందోల్: తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని మా పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడియాసలు చేసిందని దామోదర్ రాజనర్సింహ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ను వేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని రాజనర్సింహ హామీనిచ్చారు. శుక్రవారం చౌటకూరు మండలం సరాఫ్ పల్లి వద్ద ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ గర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సభలో నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ మరొకటి లేదని దామోదర్ అన్నారు.
ఏ తల్లిదండ్రులను తట్టి ప్రశ్నించిన మా పిల్లలకు కొలువులు రాక అప్పుల పాలయ్యమని మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని ఎందుకు భర్తీ చేయలేదో కేసీఆర్ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. 2016 నుంచి 2023 వరకు జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 18 సార్లు పేపర్ లీక్ అయ్యిందని, దీనికి కారణం ప్రభుత్వ పరిపాలన అసమర్ధతేనని ఆయన మండిపడ్డారు. విద్యారంగంలో తెలంగాణ వెనుకబడిందని ఇప్పటివరకు 6000 పాఠశాలలు మూతపడ్డాయన్నారు.
అందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ గెలుపు ఖాయం అయిందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే దామోదర్‌తోనే సాధ్యమవుతుందని అందోల్ స్వతంత్ర అభ్యర్థి పోలీస్ కృష్ణ అన్నారు. రాష్ట్రం ఏర్పడితే పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే, నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితికి కేసిఆర్ తీసుకొచ్చారని జర్నలిస్ట్ విట్టల్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన దామోదర్‌ను గెలిపిస్తేనే రాష్ట్రంలో నిరుద్యోగులకు , విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జర్నలిస్ట్ విఠల్, ఎస్‌డీఎఫ్ కన్వీనర్ పృథ్వి, ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఉద్యమకారులు సూర్యప్రకాష్, రాజ్ కుమార్, లత, పద్మ, రాములు, సాయిలు, విద్యాసాగర్, భరత్, సిద్దు, కౌన్సిలర్ శంకర్, నాయకులు దశరథ్, గోవర్ధన్, జాకీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ కల్పనలో రాష్ట్రం నంబర్ వన్ గా చెప్పే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా : త్రిష దామోదర్
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిద్దామని గొప్పలు చెబుతున్న బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు ఉద్యోగ కల్పన విషయంలో నంబర్ వన్ అని చెప్పే దమ్ముందా అని కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు త్రిష దామోదర్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం జరిగిందని కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, బీఆర్ఎస్ పాలనలో సముచిత న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1200 మంది యువకులు అమరులైనారని వారి బలిదానాలకు అర్థం లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.