బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూబకాసురులు : Damodar Raja Narasimha
భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భూబకాసురులుగా మారారని, భూములను కబ్జా చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, అందోల్: భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భూబకాసురులుగా మారారని, భూములను కబ్జా చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకుల కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణీ పోర్టర్‌లను తీసుకొచ్చిందన్నారు. గురువారం జోగిపేటలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువగర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నిధులు, నీళ్లు, నియమాకాల పేరిట ఏర్పడిన తెలంగాణను ఒకే కుటుంబం దోపిడీకి పాల్పడుతుందన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు లేక వలసలు వేళ్తున్నారని, కూలీ పనులు చేసుకుంటున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 14 వేల కోట్ల ఆదాయం ఎక్సైజ్ నుంచి వచ్చేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో రూ.20 వేల కోట్లు కేవలం బెల్టుషాపుల ద్వారానే వస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలు, మండలాలు చేసిన కేసీఆర్ ఉద్యోగాల భర్తీని ఎందుకు చేయలేదో నిరుద్యోగులకు చెప్పాలన్నారు.
రాష్ట్రంలో 1.91 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదికను ఇస్తే, ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదో వివరణ ఇవ్వాలన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్వంలో చేపట్టిన ఉద్యోగ నియమాకాల కోసం నిర్వహించిన పరీక్ష పేపర్లు 15 సార్లు లీకేజీ కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు సంబంధించి పరీక్ష పేపర్లు మన తెలంగాణలో 15 సార్లు లీకేజీ కావడం, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో తెలుస్తుందన్నారు.