బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ: వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు

దేశ వ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా ఎయిమ్స్ కాలేజీ మాత్రమే మంజూరు చేసి నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-04-06 11:30 GMT

దిశ, సంగారెడ్డి: దేశ వ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా ఎయిమ్స్ కాలేజీ మాత్రమే మంజూరు చేసి నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో బస్తీ దావాఖానా, ఎంపీడీవో కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారని, కానీ దేశంలో వైద్య సేవలు అందించడంలో ఆయన రాష్ట్రం చిట్టచివరన ఉందని విమర్శించారు. తెలంగాణ చూసి నేర్చుకోవాలని.. బీజేపీ తమపై ఎంత సేపూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్క కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క ఏయిమ్స్ ఇచ్చారని, నాలుగేళ్ల తరువాత ప్రధాని నరేంద్రమోడీ కొబ్బరికాయ కొడుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పోయిన ఏడాది ఎనమిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు ఉండేవని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. ఒక్క ఎయిమ్స్ మంజూరు చేసిన బీజేపీ పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గతంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ 40 ఏళ్లు, టీడీపీ 20 ఏళ్లు పాలించి తాగడానికి నీళ్లు కూడా అందించలేదన్నారు. కేసీఆర్ ఎనమిదేళ్లలో నీటి సమస్య పూర్తిగా తొలగించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ గోపాల్, ఎంపీపీ తొంట యాదమ్మ, కమిషనర్ కష్ణారెడ్డి, ఎంపీపీ పూజ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News