గ్రామాల్లో జోరుగా బెల్టు షాపులు..24 గంట‌లు అందుబాటులో మద్యం

Update: 2022-01-21 12:48 GMT

దిశ‌, అందోల్: మ‌ద్యం దోపిడి షురువైంది.. గ్రామాల్లో విచ్చల‌విడిగా బెల్టుషాపుల నిర్వహ‌ణతో 24 గంట‌ల పాటు మందు అందుబాటులో ఉంటుంది. అక్రమ వ్యాపారం య‌థేచ్చగా కొన‌సాగుతున్నది. ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా మ‌ద్యం పాల‌సీకి వ్యతిరేకంగా.. అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల్లో గ‌ల్లీ గ‌ల్లీలో రేయింబ‌వ‌ళ్లు మ‌ద్యం అందుబాటులో ఉంచుతున్నారు. క‌ట్టడి చేయాల్సిన అధికారులు నోరు మోద‌ప‌క‌పోవ‌డంతో ఎంఆర్‌పీ ధ‌ర‌ల కంటే అధికంగా విక్రయిస్తూ..మ‌ద్యం ప్రియుల జెబుల‌కు చిల్లు కొడుతూ బెల్టు షాపుల నిర్వహ‌కుల అక్రమ వ్యాపారం మూడు పువ్వులు..ఆరుకాయాలుగా య‌థేచ్చగా కొన‌సాగుతున్నది.

అధికారికంగా మ‌ద్యం దుకాణాల‌ను పొందిన వారే గ్రామాలకు మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేసి..బెల్టు షాపుల నిర్వహ‌కుల ద్వారా విక్రయించి, అధిక లాభాల‌ను గ‌డిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన జోగిపేట ప‌ట్టణంలోని నాలుగు వైన్సు షాపులుండ‌గా, ఈ దుకాణాల నుంచే గ్రామాల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా అవుతుంది. బెల్టు షాపు నిర్వహ‌కుడి నుంచి ఎంఆర్‌పీ ధ‌ర‌కంటే అధ‌నంగా డ‌బ్బులు తీసుకుని ఎవ‌రైనా వ‌స్తే తాము చూసుకుంటామ‌ని మీరు నిశ్చతంగా మ‌ద్యం విక్రయాలు జ‌రుపుకొవాల‌ని భ‌రోసానిస్తున్నట్లు స‌మాచారం. బెల్టు షాపు నిర్వహ‌కులు ఆటోలలో...ద్విచ‌క్ర వాహ‌నాల‌పై మ‌ద్యం బాటిళ్లను బ‌హిరంగంగానే తీసుకేళ్తున్నారు.

అధికారుల అండ‌దండ‌లు

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా మ‌ద్యం దుకాణాల నిర్వహ‌ణ‌ గ్రామాల్లో బెల్టు షాపుల ఏర్పాటు య‌ధేచ్చగా కొన‌సాగుతుండ‌డంపై ఎక్సై‌జ్ అధికారుల అండ‌దండ‌లు నిర్వహ‌కులకు ఉన్నట్లుగా తెలుస్తొంది. ఇటీవ‌ల అందోలు వైస్ ఎంపీపీ మ‌హేశ్వర్‌రెడ్డి మండ‌ల స‌ర్వ స‌భ్య స‌మావేశంలో మా పోతిరెడ్డిప‌ల్లి గ్రామంలోనే బెల్టు దుకాణాలు సుమారుగా 8 వ‌ర‌కు ఉంటాయ‌ని అధికారులు ఏం చేస్తున్నారని క‌ట్టడి చేయాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ స‌మావేశంలో ప్రశ్నించారు. అయినా అధికారులు ఇప్పటివ‌ర‌కు ఏలాంటి చ‌ర్యలు చేప‌ట్టక‌పోవ‌డంపై స‌ర్వత్రా విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో గ్రామంలో సుమారుగా 8 నుంచి 10 వ‌ర‌కు బెల్టు షాపులు ఉన్నాయంటే అధికారుల అల‌స‌త్వం ఏపాటిదో తెలుస్తోంది.

వైన్స్ షాపుల ఉన్నా.. బెల్టు షాపు త‌ప్పనిస‌రి

ప్రభుత్వం నిర్ణయించిన మ‌ద్యం దుకాణాల ఉన్నచోట్లలోనూ బెల్టుషాపుల నిర్వహ‌ణ త‌ప్పనిస‌రిగా మారింది. వైన్స్ షాపుల నిర్వహ‌ణ ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిర్వహించాల్సి ఉంటుంది. వైన్సు షాపులు మూసేసిన త‌ర్వాత కూడా బెల్టు షాపు రూపంలో మ‌ద్యం విక్రయాలు జోరుగా కొన‌సాగుతున్నాయ‌న‌డంలో ఏలాంటి సందేహం లేదు. ఎంఆర్‌పీ ధ‌ర కంటే అద‌నంగా క్వాట‌ర్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 వ‌ర‌కు, బీరు బాటిల్‌పై అద‌నంగా రూ.50 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. మ‌ద్యం ప్రియులు సైతం చేసేదిలేక అధిక ధ‌ర‌లకు మ‌ద్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు.

వైన్స్ ముందు పెగ్గేస్తున్నరుః

వైన్సు షాపుకోక ప‌ర్మిట్ రూమ్ త‌ప్పనిస‌రి తీసుకొవాల‌న్న నిబంధ‌న‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. వైన్సుతో పాటు ప‌క్కనే ప‌ర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకొవాలి. అయితే జోగిపేట‌లోని కొన్ని వైన్సులు ప‌ర్మిట్ రూమ్ ఉన్నట్లుగా ప్రభుత్వానికి చూపిస్తూ..రూమ్ కోసం చెల్లించాల్సిన రుసుమును కొట్టేస్తున్నారు కానీ రూమ్ ను ఏర్పాటు చేసుకొవ‌డం లేదు. వైన్సులో మ‌ద్యం కొనుగోలు చేసిన వారు అక్కడే దుకాణం ముందే సేవిస్తున్నారు. వైన్సు ప‌క్కనే మ‌ద్యం మ‌త్తులో తూగి ప‌‌డిపోతున్నారు. స‌మీపంలోనే పోలీస్ స్టేష‌న్ ఉన్నప్పటికీ వారు కూడా ప‌ట్టించుకొవ‌డం లేదు. జోగిపేట లో బస్టాండ్ పక్కన ఉన్న వైన్స్ కు పర్మిట్ రూమ్ లేకపోవడంతో వైన్స్ ముందే పెగ్గేస్తుండడంతో బ‌స్టాండ్‌కు వేళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అటు వైపు నుంచి వెళ్లేందుకు జంకుతున్నారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వైన్సుల నిర్వహ‌ణ

ప్రభుత్వ నిబంధ‌న‌ల‌ను అతిక్రమించి వైన్సు నిర్వహ‌కులు దుకాణాల‌ను య‌థేచ్చగా కొన‌సాగిస్తున్నారు. వైన్సు దుకాణాల‌లో కేవ‌లం మ‌ద్యం మాత్రమే విక్రయించాల్సి ఉంది. కానీ మందుతో పాటు ప‌ల్లీల ప్యాకేట్లు, గ్లాసులు, వాట‌ర్ ప్యాకేట్‌ల‌ను అమ్ముకుంటూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా అధికారుల‌కు తెలిసినా ఏనాడు ప‌ట్టించుకొకుండా చూసి చూడ‌న‌ట్లు వ్యవ‌హ‌రించ‌డంపై ప‌లు అనుమానాల‌కు వ్యక్తం మవుతున్నాయి.

Tags:    

Similar News