వరద కాలువపై అపార్ట్ మెంట్లు.. నోటీసులిచ్చి గాలికొదిలేసిన అధికారులు

నల్లచెరువు మాసానికుంట వరద కాలువ నాలాను ఆక్రమించి ఆక్రమణదారులు యథేచ్చగా బహుళ అంతస్తుల భవనం నిర్మించారు.

Update: 2024-10-18 02:17 GMT

దిశ, సంగారెడ్డి: ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు ఆక్రమణదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని చెరువులు, కుంటలతో పాటు వరద కాలువలు కనుమరుగవుతున్నాయి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు అనుసంధానంగా ఉన్న నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కాల్వలపైనే బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. గతంలో విశాలంగా ఉన్న నాలాలు నేడు కుచించుకుపోయి మురికికాలువలను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలోని ఆదర్శనగర్ లో నల్ల చెరువు మాసానికుంట వరద కాలువ నాలాను ఆక్రమించి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. నల్లచెరువు మాసానికుంట వరద కాలువను పూడ్చి భవనం నిర్మిస్తున్నారు. దీనిపై కాలనీవాసులు రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన మున్సిపల్ అధికారులు జూలై 25వ తేదీన అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించి వెంటనే నిర్మాణం ఆపివేయాలని భూమికి సంబంధించిన ఏమైనా కాగితాలు ఉంటే మూడు రోజుల్లో చూపించాలంటూ, లేనిచో నిర్మాణాన్ని కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి మూడు నెలలు దాటి పోయినా కూడా భవన నిర్మాణ పనులు ఆపలేదు. వరద కాలువను ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే పట్టించుకోవలసిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మౌనం పాటిస్తున్నారు.

యథేచ్ఛగా నాలాపై బహుళ అంతస్తుల నిర్మాణం..

నల్లచెరువు మాసానికుంట వరద కాలువ నాలాను ఆక్రమించి ఆక్రమణదారులు యదేచ్చగా బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. నెల్లచెరువు నుంచి హౌజింగ్ బోర్డులోని మాసానికుంట మధ్య ఉన్న వరద కాలువ దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ వరద కాలువకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నల్ల చెరువు నుంచి మాసాని కుంట మధ్యలో ఉన్న వరద కాలువకు ఇరువైపులా నిర్మించిన అపార్టుమెంట్లకు మునిసిపల్ అధికారులు అడ్డదారుల్లో అడ్డగోలుగా అనుమతులిచ్చారనే ఆరోపణలున్నాయి. 2018లో పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సంగారెడ్డి మునిసిపాలిటీలో విలీనమైన ఆనంతరం కూడా పాత తేదీలతో అనుమతులిచ్చినట్లు పోతిరెడ్డిపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. ఇందులో కొన్ని భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లుగా గుర్తించిన మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మాసానికుంట వరద కాలువపై బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తుంటే ఇది అక్రమ నిర్మాణమని తెలిసినా మున్సిపల్ అధికారులు జూలై నెలలో నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారు. కాగా ఇదే భవన యజమాని తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయి.. అంటూనే వారి పేరుపై ఉన్న భూమిలో కాకుండా నాలాపై నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. కానీ భవన నిర్మాణ పనులు మాత్రం ఆపలేదు. ఎందుకు అక్రమార్కులకు సహకరిస్తున్నారో వారికే తెలియాలి మరి.


Similar News