బీఆర్ఎస్‌కు మరో షాక్… కాంగ్రెస్‌లోకి ఎలక్షన్ రెడ్డి

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనున్నది.

Update: 2024-03-27 15:54 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గంగు మల్ల ఎలక్షన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే ఎలక్షన్ రెడ్డి ఆయనతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోన్నారు. గజ్వేల్ సెగ్మెంట్ రాజకీయాల్లో ఎలక్షన్ రెడ్డిది చెరగని ముద్రగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన ఆయన అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 14 ఏండ్ల క్రితం సీఎం కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్‌లో చేరిన ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని కలత చెంది కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

డీసీసీబీ చైర్మన్‌గా సుపరిచితుడు..

ఎలక్షన్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. నియోకవర్గంలోని తూప్రాన్‌కు చెందిన ఎలక్షన్ రెడ్డి టీడీపీలో ఉంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో తన వంతు కృషి చేశారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 14 ఏండ్ల క్రితం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్‌గా మరో వైపు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియోజకవర్గంలో తన వంతుగా పార్టీకి సేవలందించారు.

బీఆర్ఎస్ మోసం చేసింది…

సరిగా 14 ఏండ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన తనకు పార్టీ ఎన్నో ఆశలు చూపిందని ఆయన గుర్తు చేస్తున్నారు. పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ మంచి అవకాశం కల్పించలేదని, సీనియర్ రాజకీయ నాయకుడైన తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకున్నారని ఆయన సన్నిహితుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉండగానే ఏం చేయలేదు...ఇక ఇప్పుడు ఇంకా ఏం చేస్తారంటూ బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. పలు సందర్భాల్లో గజ్వేల్ కు చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి తనను అకారణంగా తిట్టినప్పటికీ అధిష్టానం కనీసం స్పందించలేదని, విలువలు లేని పార్టీలో తాను ఇక ఉండలేనని ఆయన దిశ ప్రతినిధితో వెల్లడించారు.

సన్నిహితుడు మదన్ రెడ్డితో కలిసి…

మదన్ రెడ్డికి ఎలక్షన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. మదన్ రెడ్డితో పాటు తనకు పార్టీలో అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మదన్ రెడ్డికి కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారని చెబుతున్నారు. ఎంపీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి చివరికి మాజీ కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని ఖరారు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎలక్షన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మదన్ రెడ్డితో కలిసి ఎలక్షన్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు.


Similar News