అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలి : అనితా రామచంద్రన్
బడిబాట కార్యక్రమాలాగా అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని
దిశ,సంగారెడ్డి : బడిబాట కార్యక్రమాలాగా అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ,ప్రతినెలా 20 అంగన్వాడీ కేంద్రాలు తనిఖీలు చేపట్టాలని, ఇంటింటికీ అంగన్వాడీ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అంగన్వాడీ సీడీఎంలు ,సూపర్వైజర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని 1504 కేంద్రాలలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ కేంద్రం సూపర్ వైజర్లను ఆదేశించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లల (సామ్, మామ్ చిల్డ్రన్) వివరాలను ప్రతి నెల నమోదు చేయాలని, అటువంటి పిల్లలకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి అంగన్వాడీ సేవలను ప్రచారం చేయడం, తల్లిదండ్రులకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం , పిల్లల హాజరు పెంచేందుకు కౌన్సిలింగ్, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు సమయానికి వైద్య పరీక్షలు, పోషకాహారం, అవసరమైన సహకారాలు అందించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అంగన్వాడి కేంద్రాల లో విద్యుత్ సౌకర్యం తాగునీటి వసతి కి తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కొరత ఉన్న కేంద్రాలను గుర్తించి, వాటికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ జెడి విశాలాక్షి, ఆర్జెడి మోతి,జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లాలోని సీడీపీవోలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు.