రామనామ స్మరణతో మార్మోగిన రామ మందిరం
సంగారెడ్డి రామ్ మందిర్ ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. ఉదయం ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి రామ్ మందిర్ ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. ఉదయం ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మాధవానంద సరస్వతి స్వామి నేతృత్వంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి వతందార్ దంపతులు దగ్గరుండి వేడుకలను జరిపారు. కళ్యాణము అనంతరం స్వామివారి తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి తో పాటు ఇతర వసతులను కూడా ఏర్పాటు చేశారు.
రాముని సేవ చేసే ఎమ్మెల్యే అయ్యా : జగ్గారెడ్డి
తాను చిన్ననాటి తనం నుంచి ఇదే బస్తీలో ఉంటూ రాముని సేవ చేయడంతోనే ఎమ్మెల్యేగా ఎదిగానని జగ్గారెడ్డి అన్నారు. ఇదే బస్తీ నుంచి పోటీ చేసి మొదట కౌన్సిలర్ గా, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా, ఆ తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాముని సేవ చేయడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను వెన్నంటే ఉండి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
రాముడు చూపిన బాటలో నడవాలి : మాధవానంద స్వామి
భక్తులు రాముడు చూపిన సన్మార్గంలో నడవాలని మాధవానంద స్వామి సూచించారు. కల్మషం లేని భక్తితో రాముడిని కొలిస్తే సకల పాపాలు హరించి సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. ఈ వేడుకల్లో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.