రేపే శ్రీ జోగినాథుడు రథోత్సవం.. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు
జోగిపేటలో ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీ జోగినాథ స్వామి దేవాలయ జాతర ఉత్సవాలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, ఆందోల్: జోగిపేటలో ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీ జోగినాథ స్వామి దేవాలయ జాతర ఉత్సవాలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన జాతర ఉత్సవాలు ఈ నెల12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ జాతర ఉత్సవాల్లో ప్రధానంగా రథోత్సవం, లంకాదాహనం, శివపార్వతుల కల్యాణోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన (సోమవారం) రథోత్సవం కార్యక్రమం ఉన్నందున భారీ ఎత్తున కన్నుల పండువగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా ఇప్పటికే జోగినాథ అలయంతో పాటు పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రత్యేకంగా ఎల్‌ఈడీ డిజిటల్ లైటింగ్ బోర్డులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో రాత్రి వేళలో కాంతిమయంగా పట్టణం వెలిగిపోతుంది.
రాష్ట్రంలోనే అతి పెద్ద పంచలోహ రథంగా పే రొందిన శ్రీ జోగినాథుడి రథం సోమవారం రాత్రి 9:30 గంటలకు రథోత్సవ ఊరేగింపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రథం 50 ఫిట్ల ఎత్తుతో 20 టన్నుల ఇనుముతో 5 అంతస్తులతో రథాన్ని తయారు చేయించారు. ఒక్కోక్క అంతస్తులో గణపతి, నాగసర్పం, దుర్గామాత, నందీశ్వరుడు, జోగినాధుల దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్బంగా రథానికి రంగు రంగుల విద్యుత్ దీపాలు, సరికోత్త డిజైన్‌లతో కూడిన లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి అకట్టుకునే విధంగా సిద్దం చేస్తున్నారు. రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కొరారు.