సర్కార్ స్థలమైతే నేనే అప్పగిస్తా... అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్

2 లక్షల మంది జనాభాకు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు సర్కార్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను నిర్మించుకోవాల్సిన అవసరం లేదని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.

Update: 2024-09-03 17:17 GMT

దిశ, పటాన్ చెరు : 2 లక్షల మంది జనాభాకు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు సర్కార్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను నిర్మించుకోవాల్సిన అవసరం లేదని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. సర్వేనెంబర్ 462 లో చేపట్టిన కూల్చివేతల పై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వేనంబర్ 462ను అనుకొని ఉన్న పట్టా సర్వే నంబర్ 461 లో 2018లో తాను అప్పటి భూ యజమానుల నుంచి 1.07 ఎకరాల భూమిని కొనుగోలు చేశానన్నారు. అప్పుడు వారు సూచించిన ల్యాండ్ పొజిషన్ మేరకు తాను తన భూమిలో నిర్మాణాలను చేశానని తెలిపారు. అయితే తాను కొనుగోలు చేసిన పట్టా భూమి పక్కన ప్రభుత్వ భూమి ఉండడంతో తన భూమిలో ఉన్న నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని పొరపడి ఉండవచ్చునన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీకి చైర్మన్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనకు ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాల్సిన అవసరం లేదన్నారు. సరైన సర్వే రిపోర్ట్ లేకుండా పొంతనలేని సర్వేలతో తన భూమిలో నిర్మాణాలను కూల్చివేయడం అన్యాయమని వాపోయారు. తన పట్టా భూమి పక్కన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఉండడమే తన శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. కనీస అవగాహన లేకుండా సరైన సర్వే చేయకుండానే తన భూముల్లో నిర్మాణాలను కూల్చివేశారని ఆరోపించారు.

చుట్టుపక్కల యజమానులతో కలిసి సర్వే నిర్వహించి నిజా నిజాలు నిర్ధారించిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని ఎంతగా ప్రాధేయపడ్డ అధికారులు వినిపించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. సర్వే నిర్వహించిన తర్వాత ఆ భూమిలో ప్రభుత్వ భూమి తెలితే నేనే స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వానికి అప్పగించేవాన్ని తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు తెలిపిన కనీస సమయం ఇవ్వకుండా సర్వే నిర్వహించకుండా నిర్మాణాలను కూల్చడం అన్యాయమన్నారు. తన భూమిలో నిర్మాణాలకు కోర్టు నుంచి స్టే ఉన్న ఆ విషయాన్ని సైతం అధికారులు పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పూర్తి హద్దులతో సర్వే నిర్వహిస్తే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ చూపి వెంటనే సర్వే నిర్వహించి సర్వేనెంబర్ 461 లో ఉన్న తన భూమిని తనకు అప్పగించి మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు.


Similar News