కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచుతో అంబేద్కర్ బొమ్మ..
రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుని ఓ యువకుడు శభాష్ అనిపించుకుంటున్నాడు.
దిశ, అల్లాదుర్గం : రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుని ఓ యువకుడు శభాష్ అనిపించుకుంటున్నాడు. తనకున్న ఆసక్తికి కళను జోడించి వినూత్నమైన ఆలోచనతో వివిధ రకాల బొమ్మలను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపుర్ గ్రామానికి చెందిన బచ్చలి మోహన్ అనే యువకుడు సరికొత్త ఆలోచనతో కొబ్బరి చిప్పలు, కొబ్బరి బూరును వినియోగించి బొమ్మలను తయారు చేస్తుంటాడు.
ఈ నెల 14వ తేదీన జరుగనున్న అంబేద్కర్ జయంతికి వినూత్నంగా ఆయన బొమ్మను తయారు చేయాలని అనుకున్నాడు. తనకున్న అభిమానాన్ని కనబరిచేందుకు కావలసిన కొబ్బరి చిప్పలు, బూరును సేకరించి వాటితో మొదటగా ఆకారాన్ని చేసి రంగులద్ది అంబేద్కర్ బొమ్మను తయారు చేశాడు. గతంలో కూడా చిన్నచిన్న బొమ్మలను తయారుచేసే మోహన్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ బొమ్మను చిన్ని ప్రయత్నంగా చేశానని తెలిపారు. ఆ విగ్రహం చూడ్డానికి ఎంతో సుందరంగా అగుపిస్తుండడంతో అది అందరినీ ఆకట్టుకుంటుంది.