ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలి: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు.

Update: 2023-03-17 12:16 GMT

దిశ, సంగారెడ్డి: పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను పదేళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు.

బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి అయినా పొందేందుకు అప్ డేట్ చేసుకున్న ఆధార్ ఉపయోగపడుతుందని వివరించారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సమీపంలో గల ఆధార్ కేంద్రాలలో అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. https://myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో కూడా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపారు.

సలహాలు, సందేహాల నివృత్తికి 1947 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయవచ్చని తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆధార్ నవీకరణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ అధికారి పద్మావతి, ఈ-సేవ జిల్లా మేనేజర్, ఈ డిస్ర్టిక్ట్ మేనేజర్, ఎన్ఐసీడీఐవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News