రివర్స్ లో పాటలు పాడుతూ, మాట్లాడుతూ ప్రశంసలు పొందుతున్న యువకుడు..
రివర్స్ లో పాటలు పాడటంలో దిట్ట. చిన్ననాటి నుంచే మాటలను రివర్స్ లో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు.
దిశ, జిన్నారం : రివర్స్ లో పాటలు పాడటంలో దిట్ట. చిన్ననాటి నుంచే మాటలను రివర్స్ లో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఏమైనా సీక్రెట్స్ ఉంటే ఎవరికి అర్థం కావొద్దనే ఉద్దేశంతో స్నేహితులు కలిసి ఈ రివర్స్ మాటలను సరదాగా నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ రివర్స్ పాటలు, మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రివర్స్ లో ఎంతటి పాటనైనా అనర్గళంగా పాడే సత్తా ఈ యువకుడిది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
జిన్నారం మండలంలోని అండూర్ గ్రామానికి చెందిన మ్యాదరి రవి, అలవేణి దంపతులకు మహేష్, అఖిలేష్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 20 ఏళ్ల క్రితం మహేష్ సదాశివపేట మండలం తిమ్మన్నగూడెం గ్రామంలోని అమ్మమ్మ వద్ద ఉంటూ విద్యను అభ్యసించాడు. ఏడవ తరగతి చదువుతున్న సమయంలో స్నేహితులు మాట్లాడే మాటలు ఉపాధ్యాయులకు, ఇతరులకు అర్థం కావొద్దనే ఉద్దేశంతో మాటలను రివర్స్ గా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని డెకరేషన్ బిజినెస్ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. దీంతో పాటు పాటలను రివర్స్ గా పాడడం మహేష్ లో ఉన్న ప్రత్యేకత. అతడు మాట, పాటలను రివర్స్ లో అద్భుతంగా పాడతాడు.
అనేక అవార్డులు సొంతం చేసుకున్న మహేష్..
పాటలను రివర్స్ లో పాడటం అలవాటు చేసుకున్న మహేష్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మహేష్ శివ నంది అవార్డును దక్కించుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు 50 వరకు వివిధ రకాల అవార్డులను మహేష్ ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా అందుకున్నాడు.
బుల్లి తెర పై ఇంటర్వ్యూలు, ప్రదర్శనలు..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ టీవీ ఛానల్ లలో మహేష్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో పాటు పలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. జబర్దస్త్, పటాస్ లాంటి ఫన్ ఉన్న ప్రోగ్రాం లలో మహేష్ పాడిన రివర్స్ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అవకాశాలు కల్పించాలి: మహేష్
గతంలో టీవీ కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జానపద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం తగిన అవకాశాలు లేవు. డెకరేషన్ బిజినెస్ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. తనకు ఎవరైనా అవకాశాలు కల్పిస్తే సద్వినియోగం చేసుకుంటా.