sugar factory : రైతులకు తీపి కబురు..అందుబాటులోకి మరో చక్కెర ఫ్యాక్టరీ
జహీరాబాద్ చెరుకు రైతుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. రైతుకు ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
దిశ, ఝరాసంగం : జహీరాబాద్ చెరుకు రైతుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. రైతుకు ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తూరు (బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారం తో విసుగు చెందిన రైతులు చెరుకును కర్ణాటక, మహారాష్ట్రకు, కామారెడ్డి, తదితర ప్రాంతాలకు చెరుకు ని తరలించేవారు. రాయికోడ్ మండలం పరిధిలోనీ మాటూర్ గోదావరి గంగ ఆగ్రో పరిశ్రమ నూతన ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం జహీరాబాద్ ప్రాంత రైతులు ఉపశమనం లభించనుంది. గానుగను ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
చెరుకు అభివృద్ధి చట్టం ప్రకారం ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని వట్టిపల్లి, రాయికోడ్, రేగోడు, ఝరాసంగం, కోహిర్, న్యాల్ కల్, తదితర ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి ఫారం-2 ప్రకారం చెరుకు క్రషింగ్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. నవంబర్ 8 న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన ర్సింహ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా పూజలు చేసి ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం మూడు లక్షల టన్నుల చెరుకు క్రాసింగ్ చేసే అవకాశం ఉందని యాజమాన్యం అంచనా వేసింది. గతంలోనే రైతులకు 8 వేల ఎకరాలకు విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు.
చెరుకు పంట సాగు చేసే రైతులకు మద్దతు ధర అందించే విధంగా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు రైతులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. గత నెల సంబంధిత అధికారుల, రైతు సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రధానంగా చెరుకు మద్దతు ధరను మెట్రిక్ టన్ను కు (MT) రూ. 3682/-గా నిర్ణయించిందని అధికారులు తెలిపారు. రైతుల అభిప్రాయం ప్రకారం, 2024-25 సంవత్సరం కోసం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మెట్రిక్ టన్నుకు రూ. 4500/- చెల్లించాలన్నరైతుల డిమాండ్‌ను షుగర్ ఫ్యాక్టరీ ల యజమాన్యాల ముందు ఉంచారు.
రోడ్ల మరమ్మత్తులు చేయండి
నూతనంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం ఫ్యాక్టరీ కి వెళ్లే దారులన్నీ కొంత మేరకు దెబ్బతిని ఉన్నాయి. చెరుకు తరలించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాయికోడ్, ఝరాసంగం, న్యాల్ కల్, రేగోడు, వట్టిపల్లి మండలాలకు వెళ్లే ప్రధాన రోడ్ల పైన గుంతల గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని రైతులు సంబంధిత అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.