ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లిన లారీ
ఊరూరు తిరుగుతూ పాత ఇనుప సామాన్లు సామాగ్రిని పోగు చేసుకుంటూ దినసరి కూలీగా జీవనం సాగించే వ్యక్తిని వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది.
దిశ, దౌల్తాబాద్: ఊరూరు తిరుగుతూ పాత ఇనుప సామాన్లు సామాగ్రిని పోగు చేసుకుంటూ దినసరి కూలీగా జీవనం సాగించే వ్యక్తిని వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన కొంగరి యాదయ్య (55) నిత్యం గ్రామాల్లో తిరుగుతూ (స్క్రాప్) పాత ఇనుప సామాను పోగు చేసుకుని గజ్వేల్‌లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతని భార్య భూలక్ష్మి బీడీ కార్మికురాలుగా కుటుంబ పోషణకు తన వంతు సహకారం అందిస్తోంది. వీరిది నిరుపేద కుటుంబం. వీరికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. కూతురుల వివాహం కోసం అప్పులు చేశారు. బతుకుతెరువు కోసం దినసరి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు.
ప్రతి రోజులాగే యాదయ్య తన మోటార్ సైకిల్ టీవీఎస్ ఎక్సెల్ పై పాత ఇనుప సామాను కోసం వెళ్తున్న క్రమంలో అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులో వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీ కొట్టింది. యాదయ్య ఎడమ చేయి శరీరం నుండి పూర్తిగా విడిపోయి, తలకు కాళ్లకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా తన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ ను రెండు కిలోమీటర్ల దూరం వరకు లారీ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్ ఎక్స్ఎల్ వాహనాన్ని తొలగించి వెళ్లిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా, అజాగ్రత్తగా లారీని నడుపుకుంటూ మోటార్ సైకిల్ ఢీ కొట్టి తన భర్త మృతికి కారణమైన హెచ్ఆర్ 38 ఏఏ 5229 లారీ డ్రైవర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.