డెంగీతో ఐదేళ్ల బాలుడు మృతి
డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతి చెందిన బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో నివాసం ఉంటున్న రాజు రజిత ల కుమారుడు అయాన్ష్ కు జ్వరం రావడంతో ఈనెల 19న పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా మందులు రాసి ఇంటికి పంపించారు.
జ్వరం తగ్గక పోవడంతో ఈనెల 22 వ తేదీన మరోసారి ఆసుపత్రికి తీసుకురాగా రక్త పరీక్షలు నిర్వహించి డెంగీ గా నిర్ధారించగా ఆసుపత్రిలో చేరాలని వైద్యుల సూచన మేరకు బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి డాక్టర్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కాగా వైద్యుల నిర్లక్ష్య కారణంగా బాలుడు మృతి చెందినట్లు ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.