కారును ఆపిన పోలీసులు.. అందులో దృశ్యాలు చూసి షాక్..

గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులను అరెస్టు చేయడం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.

Update: 2024-10-17 14:59 GMT

దిశ, సంగారెడ్డి : గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులను అరెస్టు చేయడం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ గురువారం ఉదయం మనూర్ ఎస్ఐ, ఎస్-న్యాబ్ సిబ్బందితో కలిసి మనూర్ మండలం, డవూర్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. నాగిల్ గిద్ద వైపు నుండి నారాయణఖేడ్ వైపు వస్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారుని ఆపి తనిఖీ చేయగా కారు డిక్కీలో ఎండు గంజాయి దొరికిందని తెలిపారు.

కారు డ్రైవర్ బీదర్ రాష్ట్రం భాల్కి పట్టణం బిరదేవ్ కాలనీ, బసవేశ్వర్ చౌక్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడన్నారు. నిందితుడు మల్లగొండ దొంగతనం కేసులో బీదర్ జైలులో ఉండగా, అక్కడ మల్కాన్గిరి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన రాహుల్ చక్రవర్తి పరిచయమయ్యారని తెలిపారు. గత సెప్టెంబర్ నెలలో చిరాగ్ పల్లి పోలీసులు స్వాధీన పరుచుకున్న 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ తమవే నని, అప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని వెళ్ళిన డిజైర్ కారు నాదే అని ఒప్పుకున్నాడని వివరించారు. తన కారులో ఉన్న 40 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా మానూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇంకా మల్లేష్ జాదవ్, దాదా పాటిల్, రాహుల్ చక్రవర్తిలు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

50 గ్రాముల నిషేదిత హష్ ఆయిల్ పట్టివేత..

భీరంగూడ వేంకటేశ్వర స్వామి గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు నిషేదిత హష్ ఆయిల్ (గంజాయి సంభందిత) వినియోగిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అమీనపూర్ ఎస్ఐ విజయ్ రావ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ రూపేష్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను విచారించగా అఖిలేష్, ప్రేమ్,సాయి, శివ ముగ్గురు నిందితులు చదువుకునే రోజుల నుంచి కళాశాలలో హష్ ఆయిల్ తాగుటకు అలవాటుపడి బిలాల్, నివాసం సంగారెడ్డి, శంకర్, లింగంపల్లి ల వద్ద కొనుగోలు చేసి తాగే వారన్నారు. అరకులో సుబ్బారావు అనే వ్యక్తి వద్ద హష్ ఆయిల్ లభిస్తుందని తెలుసుకొని, వీళ్ళు వినియోగించుకోగా మిగిలిన హష్ ఆయిల్ అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని దురుద్దేశంతో నిందితుడు సాయి అరకు వెళ్లి 50 గ్రాముల హష్ ఆయిల్ ను తీసుకొని వచ్చి బీరంగూడ వెంకటేశ్వర టెంపుల్ వద్ద 11 చిన్న, చిన్న డబ్బాలలో నింపి గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించడానికి వేచి చూస్తూ ఉండగా, అమీన్పూర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని హష్ ఆయిల్ స్వాధీనపరచుకొని అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లోకేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డ్ లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నాగరాజు, నారాయణ్ ఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మనూర్ ఎస్ఐ రాజశేఖర్, సీసీ‌ఎస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News