Medak: దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

దక్షిణ మధ్య రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు.

Update: 2024-10-24 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించిన వివరాలను రైల్వే జీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలోనే మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పలు ఆర్ఓబీ, ఆర్‌యూబీ రైల్వే లైన్స్ తో పాటు వివిధ పెండింగ్ పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎంపీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. అలాగే ఈ పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని రైల్వే జీఎంను కోరినట్లు తెలిపారు. ఇందులో.. లింగంపల్లి నుంచి నాగులపల్లి మధ్యలో 153.800 కిలోమీటరు వద్ద రెండు లైన్ ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చెయ్యాలని, సిద్దిపేట జిల్లా రామచంద్రపురం మండలంలోని తెల్లపూర్ గ్రామం లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చెయ్యాలని గతంలోనే వినతి పత్రం కూడా ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

అలాగే చెగుంట, వడియారం రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారంలు సరిగా లేక ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది కాబట్టి వెంటనే ప్లాట్ ఫారమ్స్ అన్ని హంగులతో నిర్మాణం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ.. అత్యంత రద్దీ ప్రదేశం అయిన చేగుంట మండల పరిషత్ కార్యాలయం వద్ద చేగుంట నుంచి మెదక్ దారిలో 228 వద్ద ఆర్ఓబీ అత్యవసరం అని చెప్పారు. అంతేగాక తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లపూర్.. ఈదుల నాగుల పల్లి గ్రామాల్లో ఆర్‌యూబీ నిర్మాణాలు పూర్తి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఇక పటాన్ చెరు నుంచి మెదక్, అక్కన్నపేట్ వరకు నిర్మించతలపెట్టిన కొత్త రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభించాలని, సిద్దిపేట నుంచి పెద్దపల్లి రైల్వే లైన్ ప్రారంభించాలని, మెదక్, సిద్దిపేట రైల్వే స్టేషన్ ల నుంచి తిరుపతి వరకు కొత్త రైళ్ళను ప్రారంభించాలని విన్నవించారు. అలాగే వడియారం, అక్కన్నపేట రైల్వే స్టేషన్లలో రాయలసీమ, అజంతా ఎక్స్ప్రెస్ రైళ్ళను హాల్టింగ్ చెయ్యాలని, సరుకుల రవాణా కోసం వడియారం, సిద్దిపేటలో నూతన రేక్ పాయింట్స్ కూడా నిర్మాణం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిన అనేక పనులు, నూతన పనులను వెంటనే ప్రారంభించడం వల్ల మెదక్ పార్లమెంట్ పరిధి లో ప్రజలకు అభివృద్ది, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని రఘునందన్ రావు తెలిపారు.

 

 


Similar News