Congress కు అదే పెద్ద మైనస్ పాయింట్.. Marri Shashidhar Reddy సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నుంచి బహిష్కరణపై మర్రి శశిధర్ రెడ్డి మొదటిసారి స్పందించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు.

Update: 2022-11-22 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నుంచి బహిష్కరణపై మర్రి శశిధర్ రెడ్డి మొదటిసారి స్పందించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. చాలా బాధతో కాంగ్రెస్ నుంచి బంధం తెంచుకుంటున్నానని ఆవేదన చెందారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సోనియా గాంధీకి లేఖ రాశానని తెలిపారు. ఇవాళ్టి నుంచి తాను కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటంలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రారంభం నుంచి తమ కుటుంబం మొత్తం కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చిందని, కాంగ్రెస్‌కు చేతి గుర్తు సూచించిన వారిలో తమ తండ్రి చెన్నారెడ్డి కూడా ఉన్నారని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్‌లకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులు ఏజెంట్లుగా మారిపోయారని అన్నారు.

మాణిక్కం ఠాగూర్‌ రేవంత్ సొంత మనిషిలా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇన్‌చార్జి వ్యవస్థే పార్టీకి నష్టం చేస్తోందని, కాంగ్రెస్‌కు ఇది పెద్ద మైనస్ పాయింట్ అని వెల్లడించారు. పార్టీలో డబ్బు ప్రభావం భారీగా పెరిపోయిందని వ్యాఖ్యానించారు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్లమాటే పార్టీలో చెల్లుబాటు అవుతోందని ఆవేదన చెందారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ అన్ని స్థానాల్లో ఓడిపోయిందని, ఇప్పుడు రేవంత్‌కు బాధ్యతలు ఇచ్చినా అదే రిపీట్ అవుతోందని అన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో సోనియా గాంధీ కూడా ఏం చేయలేక నిస్సహాయురాలిగా మిగిలిపోయారని అన్నారు. దుబ్బాక, మునుగోడులో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్ దక్కడం లేదని తెలిపారు. అధికార టీఆర్ఎస్‌తో టీ-కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జనాల్లోకి వెళ్లిందని అన్నారు.

Tags:    

Similar News