హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలి.. మావోయిస్టు నేతల పిలుపు

హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలని మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. 2047 సంవత్సరంలోపు భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తోందన్నారు.

Update: 2023-08-05 13:43 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హిందుత్వ ఫాసిజాన్ని ఎదిరించాలని మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. 2047 సంవత్సరంలోపు భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తోందన్నారు. ఇదంతా సామ్రాజ్యవాదులు, దళారీ, దోపిడీ వర్గాలకు సంపదను దోచి పెట్టటానికే అన్నారు. ప్రజల మధ్య కులాలు, మతాల పేర చిచ్చు పెడుతోందని విమర్శించారు. దీనికి మణిపూర్​ హింస సజీవ సాక్ష్యమన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ర్ట సరిహద్దుల్లోని దండకారుణ్యంలో మావోయిస్టు నేతలు భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మణిపూర్​లో మైదాన ప్రాంత వాసులైన మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చి క్రిస్టియన్, హిందూ వర్గాల మధ్య మత ఘర్షణలు సృష్టించింది బీజేపీ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. భారత ప్రజలపై బలవంతంగా హిందుత్వాన్ని రుద్దుతున్న ఆర్ఎస్ఎస్​ను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దీనికోసం ప్రజాస్వామిక విప్లవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ పాలక వర్గాలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ప్రజాస్వామిక విప్లవాలు, జాతి ఉద్యమాలను నిర్మూలించటానికి విప్లవ ప్రతిఘాతుక సూరజ్​కుండ్​ వ్యూహాత్మక దాడులు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఈ దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ ​చారుమజుందార్, కన్హయ్ ఛటర్జీలు చూపిన ప్రజా యుద్ధ మార్గంలో సామ్రాజ్యవాద, దళారీ, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు వదిలిన అమరులకు సెల్యూట్ ​చేశారు. ఈ సందర్భంగా అమరులైన కటకం సుదర్శన్ ఎలియాస్ ​ఆనంద్​ ఎలియాస్ ​దూల దాదాను స్మరించుకున్నారు. కటకం సుదర్శన్​ సహచరి పద్మ ఆయన సంస్మరణలో నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈనెల 2, 3వ తేదీల్లో జరిగిన సభలో ఛత్తీస్​ఘడ్, తెలంగాణ రాష్ర్టాల్లోని సరిహద్దుల్లో ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. సభలో అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News