Jagan Letter: బుల్డోజర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయండి.. మావోయిస్ట్ జగన్ పిలుపు
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మాసిటీని నిర్మించి.. రైతుల పంట భూముల్ని కొల్లగొట్టే ప్లాన్ చేశారని, అక్కడి రైతులు అందుకే ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు జగన్.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారాన్ని చేపట్టి.. ఏడాది కాలం పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మావోయిస్టు కమిటీ అధికార ప్రతినిధి జగన్ (Maoist Committee Jagan) సంచలన లేఖ విడుదల చేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. కార్పొరేట్ ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తోందని ఆరోపించారు. పౌరుల ప్రాథమిక హక్కుల్ని, జీవించే హక్కుల్ని కాలరాస్తూ.. రాష్ట్రాన్ని కార్పొరేట్ మయం చేసేందుకు ఆర్థిక అభివృద్ధి పేరుతో విస్తృతంగా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారని దుయ్యబట్టారు. గ్లోబల్ హైదరాబాద్ (Global Hyderabad) నిర్మిస్తామని చెప్పి.. మూసీ సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిడెట్ (MRDCL), హైడ్రా ను ఏర్పాటు చేసి బుల్డోజర్ల పాలన చేస్తోందని మావోయిస్టు కమిటీ.. కాంగ్రెస్ సర్కార్ పై ధ్వజమెత్తారు.
నగరంలో అక్రమ కట్టడాలు చేసిన బడా వ్యక్తుల్ని వదిలేసి.. దశాబ్దాలుగా నివాసముంటున్న మధ్యతరగతి, పేద ప్రజల్ని టార్గెట్ చేశారని, వారిని అక్రమదారులుగా ప్రకటించారని ఆరోపించారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ (Damagundam Navy Radar Station) నిర్మాణం కోసం 2900 ఎకరాల భూమిని కేటాయించారని, దానివల్ల రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసమవుతుందన్నారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మాసిటీని (Lagcharla Pharma City) నిర్మించి.. రైతుల పంట భూముల్ని కొల్లగొట్టే ప్లాన్ చేశారని, అక్కడి రైతులు అందుకే ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటివారి పోరాటాన్ని కూడా వక్రీకరించి రైతులపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. ఇలా రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకంగా పోరాటం చేసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీనది ప్రక్షాళన, హైడ్రా పేరుతో బుల్డోజర్ దాడులు చేస్తున్న ప్రభుత్వంపై, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్, ఫార్మాసిటీకి వ్యతిరేకంగా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.