Manda krishna: ఇప్పటివరకు ఆవేదన చూశారు.. ఇకపై మా ఆగ్రహాన్ని చూస్తారు

అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గాలికి వదిలేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు.

Update: 2024-10-10 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గాలికి వదిలేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. వర్గీకరణ అమలు చేయకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేశారని మండిపడ్డారు. ఇక నుంచైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. గ్రూపు -1 పోస్టులకూ వర్గీకరణ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పూర్తయితేనే గ్రూపు-1 మెయిన్స్ నిర్వహించాలని అన్నారు.

అంతేకాదు.. గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు కూడా వర్గీకరణ తర్వాతే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు మరో రెండు నెలలు ఆపాలని కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదని.. రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే నడుస్తోందని ఆరోపించారు. అంతేకాదు.. ఈనెల 16న వరంగల్‌లో భారీ సమావేశం నిర్వహిస్తామన్న ఆయన.. ఆ సమావేశంలో అన్ని కమిటీల సభ్యులు పాల్గొంటారని అన్నారు. ఇప్పటివరకు ఆవేదనతోనే నిరసన చేశామని.. ఇకపై తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.


Similar News