మహిళా శక్తి క్యాంటీన్లకు పేరు ఫిక్స్.. త్వరలో సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

మహిళా సాధికారత నినాదాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలతో నడిచే క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టాలని భావిస్తున్నది.

Update: 2024-06-23 02:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా సాధికారత నినాదాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలతో నడిచే క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టాలని భావిస్తున్నది. ఇందిరాగాంధీకి తెలంగాణతో ఉన్న అనుబంధం, మహిళల స్వావలంబన కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని స్వయం సహాయక మహిళా బృందాలు, మహిళలతో నడిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఉనికిలోకే తేవాలనుకుంటున్న క్యాంటీన్లకు ఆ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నది. ఆంద్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్’, తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్’, పశ్చిమబెంగాల్‌లో ‘దీదీ కా రసోయి’ తదితర పేర్లతో ఇప్పటికే నడుస్తున్న క్యాంటీన్లను అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఆ క్యాంటీన్లకు ‘ఇందిరమ్మ’ పేరును పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇక అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమే మిగిలింది.

మంత్రి సీతక్క సమీక్ష

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నడవనున్న ఈ క్యాంటీన్ వ్యవస్థపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇటీవల అధికారులతో లోతుగా సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లోని వాటి ఫంక్షనింగ్‌పై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. రానున్న రెండేండ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు 150 క్యాంటీన్లను కేవలం మహిళలతోనే నడిచేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, దేవాలయాలు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలాంటి కొన్ని ప్లేస్‌లను తొలి దశలో ఎంపిక చేశారు. ఇవన్నీ మహిళల ద్వారానే నడుస్తున్నందున వాటికి తొలుత ‘మహిళాశక్తి క్యాంటీన్లు’ అనే పేరును మంత్రి ఫిక్స్ చేశారు. కానీ ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయాలు పలు వైపుల నుంచి రావడంతో చివరకు ప్రభుత్వం దాన్నే ఖరారు చేయాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత మరింత స్పష్టత రానున్నది.

పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే..

గత ప్రభుత్వంలో కొన్ని స్కీమ్‌లకు కేసీఆర్ పేరు పెట్టడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధానికి అనుగుణంగా ఆమె పేరు పెట్టడంపై సానుకూల స్పందన వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరును ఖరారు చేసింది. కొత్తగూడెం జిల్లాలో లాంఛనంగా ఆ స్కీమ్‌ లోక్‌సభ ఎన్నికల షెడ్యూలుకు ముందు ప్రారంభమైంది. ఇప్పుడు క్యాంటీన్లకు కూడా అదే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. గతంలో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీచేసి గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం ద్వారా దివంగత ప్రధానిగా మాత్రమే కాక తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటి తరానికి గుర్తుచేసినట్లవుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తున్నది.

మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చేతుల మీదుగా సచివాలయంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మహిళాశక్తి క్యాంటీన్ సైతం త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్‌గా మారనున్నది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే అన్ని క్యాంటీన్లకూ ఇదే పేరు ఫిక్స్ కానున్నది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ క్యాంటీన్లన్నీ నడిచేలా రూపకల్పన చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించాలని, ఆర్థికంగా పరిపుష్టి కావాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, దేశ వికాసానికి దోహదపడిన పరిస్థితులకు గుర్తుగా క్యాంటీన్లకు ఆమె పేరు పెట్టడం ఆదర్శంగా మాత్రమే కాక మహిళలకు స్ఫూర్తిగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ప్రభుత్వంలో ఉన్నది.


Similar News