పతాక స్థాయికి ‘ఏలేటి’ రచ్చ.. రేవంత్ టార్గెట్‌గా మహేశ్వర్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం

Update: 2023-04-13 02:42 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుండడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం చర్చనీయాంశమవుతుంది. తాజా పరిణామాలను బట్టి ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. పార్టీని వీడే ముందు కాంగ్రెస్లో తాను చేసిన పార్టీ విస్తరణ పనులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు పీసీసీ నేత రేవంత్ రెడ్డి కుట్ర కోణాన్ని బట్టబయలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

రేవంత్ టార్గెట్..

మహేశ్వర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న తొలి వ్యక్తిని తానేనని కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను పార్టీ నుంచి దూరం చేయాలని వ్యూహాత్మకంగా ఆయనే పావులు కదుపుతున్నాడని పరోక్షంగా మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. అయితే రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం రూపొందుకున్న నేపథ్యంలో టీపీసీసీ ఇచ్చిన నోటీసులను దృష్టిలో ఉంచుకొని ఏలేటి నేరుగా రేవంత్ పై రాజకీయంగా దాడికి దిగుతుండడం రసవత్తరంగా మారింది.

నేడో రేపో ఢిల్లీకి..

మహేశ్వర్ రెడ్డి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆయన బిజెపిలో చేరే అంశంపై ఢిల్లీకి వెళ్లి అక్కడి అగ్రనేతలతో కలుస్తారని ముందుగా ప్రచారం జరిగింది. దానికి ముందు ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు అవసరమైతే రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం పార్టీ కోసం తాను గతంలో చేసిన పనులను ఏకరువు పెడుతున్న మహేశ్వర్ రెడ్డి లిఖితపూర్వకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని సమాచారం తాను పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నదని తాను మాత్రం పార్టీ లైన్ దాటి ఎప్పుడు పనిచేయలేదని పార్టీని వీడుతానని ఎప్పుడూ కూడా తాను ప్రకటించలేదని చెప్పుకొస్తున్నారు.

ఢిల్లీలో అగ్రనేతలతో సమాలోచనలకు ప్లాన్..

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి తలెత్తితే భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని బిజెపి అగ్రనేతలతో ఢిల్లీలోనే కలిసి మంతనాలు జరిపేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న ఈటల రాజేందర్ తో మహేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఈటల ఢిల్లీకి చేరుకున్న వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు దారితీస్తోంది మరోవైపు బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. తీవ్రంగా ముదిరిన రాజకీయాల నేపథ్యంలో ఏలేటి అంశం పైనే బిజెపి తెలంగాణ అగ్రనేతలు ఇద్దరు ఢిల్లీ వెళ్లారని కూడా ప్రచారం మొదలైంది. మరోవైపు ఇటీవలనే బిజెపిలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో కూడా మహేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతో కూడా ఏలేటి టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. రెండు రోజుల్లో ఆయన చేరిక అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News