పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్?
కొత్త పీసీసీ ఎవరూ అనే చర్చ జరుగుతున్న వేళ మహేశ్ కుమార్ గౌడ్ ఖర్గేతో భేటీ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త బాస్ నియామకంపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అయితే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పీసీసీ పోస్ట్‌కు మహేశ్‌కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయిందని అందువల్లే ఆయన పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
సీఎం టూర్ తర్వాత అధికారిక ప్రకటన!..
అయితే ఏఐసీసీ సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీకి సంబంధించిన సీనియర్ల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత వారం ఢిల్లీలో పర్యటించి పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరించి వచ్చారు. ఈ క్రమంలో పీసీసీ రేసులో పలువురి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరును ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుండగా బీసీ కోటాలో మహేశ్‌కుమార్ గౌడ్, ఎస్టీకి ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ పేర్లు పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరలో పీసీసీ చీఫ్‌ను నియమించాలని సీఎం రేవంత్ ఇదివరకే సూచించగా రేపు మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన అనంతరం పీసీసీ చీఫ్‌తోపాటు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.