ఆ పాఠశాలకు పంతుళ్లు సమయానికి రారు..సమయానికి పోరు..
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామంలో గల అప్పర్
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామంలో గల అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో 80 మంది ఉన్నారు. ఈ పాఠశాలలో ఆరు మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులకు యుపిఎస్ పాఠశాల కావడం వల్ల ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం చేపట్టే సామాజిక సర్వే కోసం ఉపాధ్యాయులను ఏర్పాటు చేయలేదు. కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించకపోవడంతో వారికి వారే యమునా తీరం అన్నట్టుగా ఏ ఒక్క రోజు కూడా పాఠశాలకు హాజరు కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
వచ్చేది 11 గంటలకు పోయేది 3 గంటల తర్వాత.!
పై పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు హాజరు కావటం లేదని అనేది ఎంత నిజమో.. గురువారం బాలల హక్కుల కార్యకర్త వెంకటేష్ తోపాటు మీడియా బృందం పై పాఠశాలను మధ్యాహ్నం 3 : 30 గంటలకు వెళ్లి పరిశీలించగా అంతా సదురుకొని పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. కానీ విద్యార్థులు పాఠశాల ఆవరణలోని కూర్చుని ఉన్నారు. ఉపాధ్యాయులు లేరా అని విద్యార్థులను అడుగగా ఇంతకుముందే వెళ్లిపోయారని విద్యార్థులు తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఉపాధ్యాయులు ఏ రోజు కూడా పాఠశాల సమయపాలన పాటించడం లేదనేది నిర్ధారణ అవుతుంది.
ఎమ్మెల్యే పర్యటన ఉన్న...
పదరా మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులతో మద్దిమడుగు పుణ్యక్షేత్రం వద్ద రివ్యూ సమావేశం ఉన్న విషయం తెలిసినప్పటికీ కూడా పై పాఠశాల ఉపాధ్యాయులు మూడు గంటల తర్వాతే ఇంటి దారి పట్టారంటే ఆ ఉపాధ్యాయులు ఎంత చిత్తశుద్ధితో విధులు నిర్వహణ చేపడుతున్నారు ఇట్టే అర్థమవుతుంది.
ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా చూడండి..
పాఠశాల ఉపాధ్యాయులు మా గ్రామానికి సమయానికి వచ్చేలా మీడియా ద్వారా ఉన్నత అధికారులకు తెలిసేలా చూడాలని ఇప్పలపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా ఉండటం మూలంగానే ప్రవేటు పాఠశాల వైపు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ఉపాధ్యాయులు మా గ్రామా పాఠశాలకు సమయానికి వచ్చి విద్యార్థులు నేర్పాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎంఈఓ బుచ్చి రాములు వివరణ...
ఇప్పలపల్లి గ్రామంలో గల అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం తో పాటు మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా సమయపాలన పాటించడం లేదని, గురువారం మూడు గంటల తర్వాతే పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయిన విషయం స్వయంగా మీడియా సభ్యులు సందర్శించిన సందర్భంగా వెలుగులోకి వచ్చిందని ఇన్చార్జి ఎంఈఓ బుచ్చి రాములను ఫోన్ ద్వారా దిశ వివరణ కోరగా అలా వెళ్ళడానికి వీలు లేదని, ఆ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా సర్వేలో కూడా డ్యూటీ వెయ్యలేదని, కాస్త నాలుగు రోజుల తర్వాత అన్ని పాఠశాలను మానిటరింగ్ చేస్తామని మార్పు తప్పక కనిపిస్తుందని ఎంఈఓ తెలిపారు.