మున్సిపాలిటీ లో ఉదయం 6 నుంచి సర్వే ప్రారంభించాలి
మున్సిపాలిటీలలో ఉదయం 6 నుంచే సర్వే ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సర్వే సిబ్బందికి తేల్చి చెప్పారు.
దిశ,నారాయణపేట ప్రతినిధి : మున్సిపాలిటీలలో ఉదయం 6 నుంచే సర్వే ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సర్వే సిబ్బందికి తేల్చి చెప్పారు. జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలోని 7,8 వార్డులలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను శనివారం కలెక్టర్ పర్యవేక్షించారు. ముందుగా 8వ వార్డు అశోక్ నగర్ లో పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ సర్వే ఎందుకు వేగంగా చేయడం లేదని వార్డు ఆఫీసర్ ను ప్రశ్నించారు. సర్వర్ రావడంలేదని వార్డ్ ఆఫీసర్ చెప్పడంతో..కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సరిహద్దులో గల కృష్ణ,మాగనూరు లాంటి ప్రాంతాలలో సర్వే సమస్య లేదని,జిల్లా కేంద్రంలోనే సర్వర్ ఎందుకు రావడం లేదన్నారు. కారణాలు చెప్పకుండా సర్వేను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, వారిని ఇక్కడికి రప్పించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతాలలో సర్వేను ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే,మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు ఉదయం 10 గంటల తరవాతే సర్వేకు వెళ్తున్నారని,ఎవరెవరు ఎప్పుడు సర్వేకు వెళ్తున్నారో తాను ఆన్ లైన్ లో చూస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. వార్డుల వారీగా సర్వే రిపోర్ట్ ను చూసిన కలెక్టర్ పట్టణంలోని వార్డులలో సర్వే ఇంత నెమ్మదిగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సునీత పై అసహనం వ్యక్తం చేశారు. లో ఫోర్ఫామెన్స్ ఉన్న సిబ్బందికి మెమోలు జారీ చేయాలన్నారు. అంతకు ముందుగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ సిక్తా పట్నాయక్ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.