ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా సర్వేను త్వరగా పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
దిశ,వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా సర్వేను త్వరగా పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్నగడ్డ, రాజానగరం వడ్డెగేరిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 25 ఇళ్ళు పూర్తి చేసి వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలనీ సిబ్బందిని సూచించారు. సర్వే చేసేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలన్నారు. సర్వే యాప్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు దృష్టి కి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రాజనగరం శివారులోని అమ్మ చెరువు ను పరిశీలించారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన లైట్లు వినియోగంలో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కట్టపై క్లీనింగ్ చేయడంతో పాటు,ఉన్న ఖాళీ స్థలంలో ప్లాంటేషన్ చేయించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ
వడ్డెగేరి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి హాజరవుతున్నారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకరే హాజరు ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుల గత నెల రోజుల జియో టాగింగ్ అటెండెన్స్ వివరాలు ఇవ్వాలని ఎంఈఓ కు చెప్పారు. పాఠశాలలో విధులకు హాజరు కాని ప్రధానోపాధ్యాయుడికి షోకాస్ నోటీసు జారీ చేయాలని ఎంఈఓ కు ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈఓ కు సూచించారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.