కొనుగోలు చేసిన ధాన్యం.. మిల్లులకు తరలించాలి
వరి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: వరి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లాలోని మద్దూర్ మండలం పల్లె గడ్డ తండా, దోరేపల్లి తండాలలో ఐకెపి ఆధ్వర్యంలో.. గ్రామైక్య సహకార సంఘాల సభ్యులు ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో రోజుకు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని మహిళా సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతులతో కలెక్టర్ కాసేపు పంట దిగుబడి గురించి మాట్లాడారు. కేంద్రాల ఆవరణలో ఆరబెట్టిన రైతుల ధాన్యo కుప్పల వద్దకు వెళ్లి తేమశాతాన్ని చూశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వీలైనంత తొందరగా కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. కేంద్రాలలో అవసరమైన కాంటాలు, టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పల్లెగడ్డ తండా కేంద్రానికి అవసరమైన యంత్రాలను ఎందుకు సమకూర్చలేదని జిల్లా మార్కెటింగ్ అధికారిని బాలమణితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైనవన్నీ వెంటనే పంపించాలని ఆదేశించారు.
మద్దూరు మండలంలో మొత్తం ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం ఎన్ని ప్రారంభించారని కలెక్టర్ విచారించగా మండలం మొత్తానికి 18 కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి 15 కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మిగతా మూడు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఐకెపి, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించాలని ఆమె సూచించారు. అనంతరం కలెక్టర్ మద్దూరు మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద ఎన్యుమరేటర్స్ చేస్తున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, సర్వేలో ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఒక ఇంటి సర్వే పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. చిన్న కుటుంబాలకు 10 నిముషాలు, పెద్ద కుటుంబాలకు 20 నిమిషాల సమయం పడుతుందని అక్కడి ఎన్యుమరేటర్ కలెక్టర్ కు తెలిపారు.