దశాబ్ది కాదు నవాబు ఉత్సవాలు.. వనపర్తి డీసీసీ అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయిందని ప్రభుత్వం మాత్రం పది సంవత్సరాలయినట్టుగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని, అవి దశాబ్ది ఉత్సవాలు అనడం బదులు కేసీఆర్ నవాబు ఉత్సవాలు అనడం సబబుగా ఉంటుందని వనపర్తి అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.

Update: 2023-06-04 09:52 GMT

దిశ, వనపర్తి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయిందని ప్రభుత్వం మాత్రం పది సంవత్సరాలయినట్టుగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని, అవి దశాబ్ది ఉత్సవాలు అనడం బదులు కేసీఆర్ నవాబు ఉత్సవాలు అనడం సబబుగా ఉంటుందని వనపర్తి అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఒరగా పెట్టింది ఏమీ లేదని, ఎన్నికలు దగ్గర పడడంతో సుమారు 1000 కోట్ల ప్రజాధనం వెచ్చించి ఉత్సవాల పేరిట ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న సమయంలో అధికార గణాన్ని 21 రోజులపాటు ఉత్సవాల నిర్వహణకు బాధ్యతలు అప్పజెప్పడం ఎంతవరకు సభబు అని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు అందజేయడానికి అధికారులను వారివారి కార్యాలయాలలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2001 సంవత్సరంలోనే మాజీమంత్రి చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో వనపర్తిలో సభనిర్వహించి తెలంగాణ ఉద్యమానికి బీజం వేశారని, ఇక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని ఇవన్నీ మర్చిపోయిన బీఆర్ఎస్ వారు సొమ్ము ఒకడిది... సోకు మరొకడిది అన్నట్లుగా తెలంగాణ తామే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాలకు వచ్చిన వారందరికీ మాంసాహారంతో విందు ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టి ప్రజలకు తిండి గతిలేనట్టుగా అవమానపరుస్తున్నారని ఇది సరికాదని ఆయన అన్నారు.

ఇక అధికారులేమో ఉపాధి హామీ పనులకు వెళ్లే జనాలను నుంచి ఉత్సవాలకు తరలించి అక్కడ సమావేశం పూర్తయ్యాక వారందరూ పనులు చేసినట్టుగా పేరు నమోదు చేసుకుంటున్నారని, అధికార పార్టీ వారు ఇంత నీచానికి దిగజారడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు నేటి వరకు నెరవేర్చలేకపోయారని, అదే కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మొదటి నెలలోనే అమలు చేయడం మొదలుపెట్టిందని రాబోయే ఎన్నికలలో తెలంగాణలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని త్వరలో కేసీఆర్ విమోచన దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పర్వతాలు, మన్యంకొండ, ఎల్లన్న, జానకిరామ్, నాగరాజు, సందీప్, పురుషోత్తం పాల్గొన్నారు.

Tags:    

Similar News