చిన్నంబావిలో వీడని భూ వివాదం.. న్యాయస్థానం చేరిన పంచాయితీ
ఒకప్పుడు భూమి దుక్కి దున్ని పంటల పండించే రైతులు తప్ప పరాయి వారెవరు అటువైపు చూడని పొలాలు మాత్రమే.
దిశ, ప్రతినిధి వనపర్తి /చిన్నంబావి: ఒకప్పుడు భూమి దుక్కి దున్ని పంటల పండించే రైతులు తప్ప పరాయి వారెవరు అటువైపు చూడని పొలాలు మాత్రమే. అలాంటిది కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత కొల్లాపూర్ ప్రధాన రహదారి ననుసరించి చిన్నంబావి చౌరస్తాలో ఉన్న ఆ ప్రాంతాన్ని మండలం గా ప్రకటించారు.. దీంతో యుద్ధ ప్రాతిపదికన రహదారి వెంట వ్యాపార సముదాయాలు నివాస గృహాలు పుట్టుకొచ్చాయి.. ఇంకేముంది మార్కెట్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను, కొందరు రాజకీయ నేతల చూపు సదరు భూములపై పడ్డాయి.. ఇక అప్పటి నుంచి లడాయి మొదలైంది.. ఆ భూములు రామలింగ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చెందినవని ఎండోమెంట్ వారు.. లేదు తాతల కాలం నుంచి తామే సాగు చేస్తున్నామని భూమి పై హక్కులు మావే అని రైతుల మధ్య మొదలైన వివాదం చిక్కుముడిగా మారి ఏళ్లు గడుస్తున్నా ఎటు తేలడం లేదు.
అసలు భూముల కథ కామనిషు ఏమిటి..
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని దేవాదాయ భూముల చరిత్ర పరిశీలిస్తే మండల కేంద్రముతో పాటు మండలంలోని పెద్ద దగడ, బెక్కెం, గడ్డ బస్వాపురం శివార్లలోని 181,186,187,189,190,సర్వే నెంబర్ల పరిధిలో దాదాపు 90 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవిగా గుర్తిస్తూ వచ్చారు. సదరు భూములలో కొంత భాగం మండల కేంద్రములో ప్రధాన రహదారికి చౌరస్తాకు నలువైపులా విస్తరించి ఉండటంతో చాలా మంది కళ్ళు వీటి పై పడ్డాయి. ప్రధాన చౌరస్తాలో ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలు పలుకుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు నేతల చూపు ఈ భూముల పై పడింది. ఈ క్రమంలో దేవాదాయ భూములను అనుభవ దారులుగా వున్న కొంత మందితో పాటు ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటూ ఓ ఆర్ సి పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల తో సదరు వ్యాపారులు నేతలు తక్కువ ధరకు భూములను కొనడం చేస్తున్నారు. తర్వాత వారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వాటిని కమర్షియల్ గా మార్చడం షాపులు నిర్మించడం చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరి కొంత మంది బడాబాబులు భూములను కబ్జా చేసి యధేచ్చగా నివాసాలు, వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేసి అత్యధిక ధరలకు అద్దెలకు ఇస్తున్నారని తెలుస్తోంది.
న్యాయస్థానానికి చేరిన పంచాయతీ..
చిన్నంబావి మండలంలో ఉన్న రామలింగేశ్వర స్వామి పేరిట ఉన్న భూములన్నీ దేవాదాయశాఖ చెందినవని సదరు అధికారులు కొన్ని సంవత్సరాలుగా వాదిస్తూ వస్తున్నారు. అయితే అసలు రామలింగేశ్వర స్వామి గుడి పేరిట ఎలాంటి భూములు లేవని రామలింగేశ్వర స్వామి అనే ఒక శివారాధకుడు కవి జటప్రోలు సంస్థానంలో ఉండేవారని సంస్థ నోటీసులు సదరు వ్యక్తికి ఇనాముగా ఇచ్చిన భూములే ఇవన్నీ కనుక వాటికి తామే వారసులమని రామలింగేశ్వర స్వామి కుటుంబానికి చెందిన వారసులు అలాగే ఎన్నో ఏళ్లుగా పంటలు పండిస్తున్న రైతులు వాదిస్తూ వచ్చారు. తమకు రెవెన్యూ అధికారులు ఓఆర్సీ, పట్టాలు సైతం ఇచ్చారని తమకే సర్వహక్కులని తాము సదరు భూములను విక్రయించుకోవడానికి సైతం హక్కు ఉందని చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దేవదాయ శాఖ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం రామలింగేశ్వర స్వామి భూములపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే గతంలో దేవదాయ శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నప్పుడు భూముల పంచాయతీలో తన పేరు లాగుతున్నారని సదరు సర్వేనెంబర్ లో ఉన్న ఆరెకరాల తన భూమిని వదిలేసుకున్నారు. అయితే తర్వాత అసలు విషయం తెలిసి రామలింగేశ్వర స్వామి ఆలయం కాదని ఆయన ఒక వ్యక్తి అని స్వయంగా జూపల్లి కృష్ణా రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నేటి వరకు జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన ఆరు ఎకరాల భూమిని దేవదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోకపోవడం తో అసలు ఈ భూమి ఎవరికి చెందినదని వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.
మళ్లీ నిర్మాణాల కలకలం..
అయితే చిన్నంబావి మండలంలో వివాదంలో ఉన్న సదరు సర్వే నెంబర్ల భూమి అంశంపై అధికార పార్టీకి చెందిన నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ఈ క్రమంలో ఒక వర్గం చెందిన వారు అక్కడ భూమిని కొనుగోలు చేసి ఏవైనా నిర్మాణాలు చేపడితే మరో వర్గం చెందిన వారు దానిపై అధికారులకు ఫిర్యాదు చేయడం, పనులను నిలిపివేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ చిన్నంబావి సెంటర్లో ప్రధాన రహదారిపై కొందరు నిర్మాణాలు చేపట్టడంతో కలకలం చెలరేగింది. దీనిపై ఒక వర్గం వారు అధికారులకు ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి సర్వే చేయించి ఒకవేళ దేవాదాయ భూములని తేలితే వాటిని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం అక్కడ చేపట్టిన నిర్మాణాలపై చిన్నంబావి తహసీల్దార్ ఘన్సీ రామ్ ను దిశ వివరణ కోరగా ఇటీవల కొందరు సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు వచ్చాయని, న్యాయస్థానంలో తుది తీర్పు వచ్చేవరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా యధాస్థితి ఉండేలా చూడాలని తాను ఎంపీడీవో కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.