దిశ,చిన్న చింతకుంట : జిల్లాలో పేరుగాంచిన దేవాలయాల్లో ఒకటైన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసర ప్రాంతాలు చెత్తకు నిలయాలుగా మారాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం పర్వదినాన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన రాజగోపురం ముందు చెత్త పేరుకుపోయి పాత ప్లాస్టిక్ చెప్పులు, ఖాళీ బీరు సీసాలు దర్శనమిస్తున్నాయి.స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలను వచ్చే భక్తులు జాతర మైదానం అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శ్రావణ మాస మహోత్సవాలు ఆలయంలో జరుగుతున్నాయా ఒకవేళ జరిగితే జాతర మైదానంలో స్వచ్ఛత పై కార్యనిర్వహణాధికారి దృష్టి సారించకపోవడం దారుణమని భక్తులు వాపోతున్నారు.దేవస్థానం కు వచ్చే ఆదాయం పైనే దృష్టి పెడుతున్నారే తప్ప పరిశుభ్రతపై శ్రద్ధ చూపడం లేదని బిజెపి జిల్లా నాయకులు నంబి రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ప్రతి ఏటా దేవస్థాన ఆదాయం పెరుగుతున్న ఆలయ అభివృద్ధి మాత్రం జరగడం లేదని, జాతర మైదానంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తున్న ఆలయ అధికారులు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వస్తున్న ఆలయ ఈవో ఎందుకు దృష్టి సాధించడం లేదని ఆయన ప్రశ్నించారు .ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే జాతర మైదానంలో ఎక్కడికి అక్కడ చెత్త పేరుకుపోయిన శుభ్రం చేయడం లేదన్నారు.శ్రీ కురుమూర్తి స్వామి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇప్పటికైనా ఆలయ ఈవో దృష్టిసారించి జాతర మైదానంలో పరిశుభ్రతను ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం అభివృద్ధికి నోచుకోవడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రశాంతతను ఇచ్చేలా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు.