రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-03-28 14:10 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ/ఈ డబ్ల్యూ ఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కలిపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీ 2025 లోపు ఓబి ఎంఎంఎస్ పోర్టల్

(https://tgobmms.cgg.gov.in) ద్వారా తమకు వర్తించే సంబంధిత కార్పొరేషన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్పొరేషన్ల వారీగా పథకాల వివరాలు పోర్టల్‌లో పొందుపర్చబడినందున, దరఖాస్తుదారులు జాగ్రత్తగా పరిశీలించి తమ అర్హతకు అనుగుణంగా పథకాన్ని ఎంచుకోవాలన్నారు.ఈ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ,మున్సిపాలిటీ,నగర పంచాయతీల్లో రూ.2.00 లక్షల లోపు ఉండాలన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21-55 సంవత్సరాలు, వ్యవసాయ సంబంధిత పథకాలకు 21-60 సంవత్సరాలు వయస్సు పరిమితిగా ఉండగా, ఒక రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసే అర్హత ఉంటుందని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు ఈ పథకం అమలులో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం,కుల ధృవీకరణ పత్రం, పాన్ కార్డు,పాస్‌పోర్ట్ సైజు ఫోటో, వ్యవసాయ సంబంధిత పథకాల కోసం పట్టా పాసు పుస్తకం, దివ్యాంగుల కోసం సదరం, దరఖాస్తుదారుని మొబైల్ నంబర్ వంటి అవసరమైన ధృవపత్రాలు ఉండాలని సూచించారు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రాయితీతో పాటు బ్యాంకు రుణం అందుబాటులో ఉంటుందని తెలిపారు. యూనిట్ ధర 50వేల రూపాయల లోపు ఉంటే 100 శాతం రాయితీ, రూ.50 వేల ఒక్క రూపాయి,1లక్ష రూపాయల వరకు 90% రాయితీ, 10% బ్యాంకు రుణం,1 లక్ష నుండి 2లక్షల రూపాయల వరకు 80 శాతం, రాయితీ, 20 శాతం బ్యాంకు రుణం, 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు 70శాతం రాయితీ, 30శాతం బ్యాంకు రుణం లభిస్తుందని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ పథకాల కోసం బ్యాంకు రుణం లేకుండా 100 శాతం రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తును ఓబిఎంఎంఎస్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన ధృవపత్రాలతో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి లేదా మున్సిపల్ కమిషనర్ కు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఏవైనా సందేహాల నివృత్తి కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంను సంప్రదించాలని సూచించారు.

Similar News