సింగోటంలో విజయవంతమైన మెగా ఉచిత వైద్య శిబిరం..

మండలంలోని సింగోటంలో ఏడు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యం, రక్తదాన శిబిరం విజయవంతమైంది.

Update: 2025-01-05 13:49 GMT

దిశ, కొల్లాపూర్ : మండలంలోని సింగోటంలో ఏడు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యం, రక్తదాన శిబిరం విజయవంతమైంది. గ్రామంలోని హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, రక్త దానం శిబిరాన్ని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఛైర్మెన్, హైదరాబాద్ అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎస్పీ మధుకర్ స్వామి ప్రారంభించారు. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులచే వివిధ రకాల రోగాలకు 3500 మందికి చికిత్సలు, వైద్య పరీక్షలు అందించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, డెక్కన్ పైన్ కెమికల్స్ సహకారంతో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు. లయన్స్ క్లబ్ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు. ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన రోగులకు మెడిసిన్స్ ఉచితంగా అందజేశారు. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఛైర్మెన్, ఎస్పీ మధుకర్ స్వామి తన పుట్టినరోజు వేడుకలను వైద్య శిబిరంలో అభిమానులు, ఆప్తుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. అలాగే రచయిత వెంకటేష్ రాసిన, నిత్య చైతన్య శీలి, పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మధుకర్ స్వామి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో తన వంతుగా సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దిశా, నిర్దేశం చేస్తూ తమ ఫౌండేషన్ లక్ష్యమని మధుకర్ స్వామి అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ మధుకర్ స్వామి ప్రజలకు అవగాహన కల్పించారు. శిబిరంలో వనపర్తి సుధా నర్సింగ్ హోమ్ డైరెక్టర్, ప్రముఖ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి సైతం రోగులకు వైద్య చికిత్స అందించారు. ఈ కార్యక్రమం పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్, రాంకీ ఫౌండేషన్ సింగోటం స్వచ్ఛంద సంస్థ గ్రేస్ ఫౌండేషన్ కిమ్స్ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ సౌజన్య డెంటల్ హాస్పిటల్, పేర్నాండేజ్ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన వైద్య శిబిరానికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల బృందం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ (సెల్ టాక్స్ ) మురళీధర్, మాజీ సర్పంచ్ ఇమ్మిడిశెట్టి వెంకటస్వామి, సింగోటం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వాలింటర్లుగా వ్యవహరించారు.


Similar News