ఈ బడి విద్యార్థులు కూరగాయలు కొనరటా..ఎందుకంటే..?
ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి కూరగాయలు కొనరటా.
దిశ, అలంపూర్: ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి కూరగాయలు కొనరంట. స్వయంగా కూరగాయల మొక్కలను పెంచి..మధ్యాహ్న భోజనానికి ఆ కూరగాయలను వాడుకోవడం ఈ పాఠశాల ప్రత్యేకత. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలంలోని జల్లాపురంలోని ఉన్నత పాఠశాలలోమధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థులకు పోషకాలతో కూడిన కూరగాయలను సరఫరా చేయడంలో స్వయం సమృద్ధి సాధించింది. ప్రస్తుత కాలంలో ఏది పండించిన మందులు,ఫర్టిలైజర్స్, లిక్విడ్ మందులు పిచికారి చేయనిదే కూరగాయల పంటలను పండించే దాఖలాలు లేవు. ఎక్కడ చూసిన కలుషిత కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండడంతో.. అనేక రోగాలు వస్తున్నాయి. దీంతో అన్నింటిని చెక్ పెట్టేందుకు , చిన్నప్పటినుండే విద్యార్థులకు సరికొత్త అవగాహన కల్పించుటకు పాఠశాలలోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి.. కూరగాయలను ఎలా పండించాలో విద్యార్థులకు తెలుపుతున్నారు. అంతేకాక ఈ పాఠశాలలో పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనానికి ఉపయోగించడం కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థులకు చదువుతోపాటు,పరిసరాల పరిశుభ్రత,వారంలో ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్,రోజు అరగంట పాటు..పాఠశాలలో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్ లో మొక్కలను పెంచి నీళ్లు పోయడం వంటి కార్యక్రమాలను నేర్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల మనుగడతో పాటు.. తినే ఆహారం కల్తీ లేకుండా స్వచ్ఛతంగా ఉండాలని ఉద్దేశ్యంతో..ఈ విధంగా పాఠశాలల్లో అందరి సహకారంతో కిచెన్ గార్డెన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని గార్డెన్ ఇంచార్జ్ ఉపాధ్యాయుడు వెంకన్న తెలిపారు. విద్యార్థులు కూడా చురుగ్గా పాల్గొంటూ చదువుతోపాటు కిచెన్ గార్డెన్లో కూరగాయల మొక్కలు పెంచుటకు తోడ్పడుతున్నారని తెలిపారు. వారంలో కనీసం అయిదు రోజులు ఈ పాఠశాలల్లో పండించిన కూరగాయలను వాడుతున్నామని తెలిపారు.