దారుణం..భార్యను చంపి సెప్టిక్‌ ట్యాంక్‍లో పూడ్చిపెట్టేసిన భర్త

ఓ భర్త తన భార్యను హతమార్చి సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసిన సంఘటన సోమవారం మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-11-25 15:14 GMT

దిశ, భూత్పూర్ : ఓ భర్త తన భార్యను హతమార్చి సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసిన సంఘటన సోమవారం మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మారేపల్లి నారమ్మ (45), మారేపల్లి వెంకటయ్య దంపతులు. నారమ్మ ఇంటి పనులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా..వెంకటయ్య గొర్రెల కాపరి. వారి కుమారుడు భరత్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈనెల 17 న నారమ్మ కనిపించడం లేదు అంటూ ఆమె భర్త వెంకటయ్య కుమారుడికి సమాచారం ఇచ్చాడు. ఈనెల 21న వారి కుమారుడు భరత్ , తన తండ్రితో కలిసి వెళ్లి భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..ఎస్సై చంద్రశేఖర్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు నారమ్మ ఆచూకీ కోసం పనిచోట్ల వెతికారు. సోమవారం ఉదయం పరిసర ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోయింది. దీంతో చుట్టుపక్కల ఇండ్ల వారు పరిశీలించారు. కనిపించకుండా పోయిన నారమ్మను చంపి సెప్టిక్ ట్యాంక్ లోనే వేశారన్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా నారమ్మ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉన్న స్థితిలో గుర్తించారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.


Similar News